ఆ రెండు జిల్లాలో రెడ్‌జోన్లు ! బ‌య‌ట‌కు వెళితే త‌ప్ప‌దు క‌రోనా కాటు..

క‌రోనా బాధితులున్న ప్రాంతాల‌ను రెడ్‌జోన్ ఏరియాలుగా ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. తెలంగాణ‌లో ఇటువంటి రెడ్‌జోన్ ఏరియాలు కొన్నింటి గుర్తించింది. అందులో...

ఆ రెండు జిల్లాలో రెడ్‌జోన్లు ! బ‌య‌ట‌కు వెళితే త‌ప్ప‌దు క‌రోనా కాటు..

Updated on: Apr 03, 2020 | 7:32 AM

క‌రోనా బాధితులున్న ప్రాంతాల‌ను రెడ్‌జోన్ ఏరియాలుగా ప్ర‌క‌టించింది ప్ర‌భుత్వం. ఆ ప్రాంతాల్లో మ‌రింత క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు. అక్కడి ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌కుండా క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తున్నారు. వైర‌స్ ల‌క్ష‌ణాలు ఉన్నవారిని క్వారంటైన్‌కు త‌ర‌లిస్తున్నారు. ఇంకా ఇళ్ల‌లో మిగిలిన వారిని హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు. వారంతా 14 రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. తెలంగాణ‌లో ఇటువంటి రెడ్‌జోన్ ఏరియాలు కొన్నింటి గుర్తించింది ప్ర‌భుత్వం..అందులో…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా జాడలు పాలమూరు జిల్లాలోనూ
వెలుగుచూస్తున్నాయి. జోగులాంబ గద్వాలలో కరోనా కలకలం రేపుతోంది. గురువారం ఒకేరోజు ఏకంగా 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని పరీక్షల కోసం పంపగా అందులో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇందులో ఇద్దరు భార్యాభర్తలు కావడం గమనార్హం. వైద్యాధికారులు‌, రెవెన్యూ అధికారులు,‌ పోలీసులు కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులు ఎక్కడెక్కడ తిరిగారు,‌ ఎవరిని కలిశారు.. వంటి అంశాలపై ఆరాతీశారు. ప్రస్తుతం బాధితులను ఐసోలేషన్‌కు తరలించారు. కుటుంబసభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. వారికి స్క్రీనింగ్ పరీక్ష అనంతరం కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు, ములుగు జిల్లాలోనూ రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ఏటూరు నాగారం, పస్రాకు చెందిన ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన‌ట్లుగా జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. వీరిద్దరూ నిజాముద్దీన్‌లో తబ్లీఘీ జమాత్‌కు వెళ్లి వచ్చారనే సమాచారంతో ఎలాంటి కరోనా లక్షణాలు లేనప్పటికీ వైద్య పరీక్షలు చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు. అనంతరం వారికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని కలెక్టర్‌ వెల్లడించారు. బాధితులతో సహా కుటుంబసభ్యులను మొత్తం 26 మందిని క్వారంటైన్‌కి తరలించారు.
కరోనా బాధితులున్న ప్రాంతాలను ‘కొవిడ్ – 19 క్వారంటైన్డ్ జోన్’గా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాంతంలో కొన్ని ఆంక్షలు విధించింది. ఇక్కడున్న వారు 14 రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. అలాంటి జోన్లలో ఉన్నవారికి నిత్యావసర సరకులు, ఇతరత్రా వస్తువులు ఇంటి వద్దకే అధికారులు పంపించనున్నట్లు సమాచారం. కరోనా బాధితులు నివాసం ఉండే కాలనీలోని కిలో మీటర్ పరిధిలో రెడ్ జోన్‌గా ప్రకటించారు. వీరికి మందులు, ఇతరత్రా అవసరాల కోసం స్థానికంగా ఉన్న సిబ్బందిని ఏర్పాటు చేయనున్నారు. కిలో మీటర్ పరిధిలో ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు చేసి..అవసరమైన వారికి రక్త పరీక్షలు కూడా చేయనున్నారు.