కరోనాను జయించిన 93 ఏళ్ల మహిళ ..ఇంట్లోకి అనుమతించని కుటుంబీకులు

కోవిడ్ బారినపడ్డ బాధితుల పరిస్థితి కోలుకున్న తర్వాత కూడా చిత్రవిచిత్రంగా ఉంటోంది. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా కుటుంబ సభ్యులు వారిని ఇంట్లోకి రానివ్వని పరిస్థితులు ఎదురవుతున్నాయి. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందిన ఓ వృద్ధురాలికి ఇదే పరిస్థితి ఎదురైంది.

కరోనాను జయించిన 93 ఏళ్ల మహిళ ..ఇంట్లోకి అనుమతించని కుటుంబీకులు
Follow us

|

Updated on: Jun 24, 2020 | 3:34 PM

భారత్‌లో మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులను మొత్తంగా పరిశీలిస్తే.. వైరస్ బారిన పడుతున్న వారిలో ఎక్కువగా 50 ఏళ్లకు పైబడిన వారే ఉంటున్నారు. వయసు మీద పడిన తర్వాత మనిషిని సహజంగానే రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వెంటాడుతుంటాయి. ఇలా రోగనిరోధక శక్తి ఎవరిలో అయితే తక్కువగా ఉంటుందో వారికి కరోనా సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే..హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో 93 ఏళ్ల మహిళ కరోనాను జయించింది. చికిత్స అనంతరం కోలుకున్న ఆ మహిళను ఇంటికి తీసుకెళ్లేందుకు మాత్రం కుటుంబీకులు నిరాకరిస్తున్నారు.

కోవిడ్ బారినపడ్డ బాధితుల పరిస్థితి కోలుకున్న తర్వాత కూడా చిత్రవిచిత్రంగా ఉంటోంది. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత కూడా కుటుంబ సభ్యులు వారిని ఇంట్లోకి రానివ్వని పరిస్థితులు ఎదురవుతున్నాయి. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందిన ఓ వృద్ధురాలికి ఇదే పరిస్థితి ఎదురైంది. వ‌ృద్ధురాలితో పాటు ఆమె కుమారుడు, ఇద్దరు మనవరాళ్లు కరోనా వైరస్ బారినపడ్డారు. అయితే, వారంత గతంలోనే కోలుకుని ఇంటికి వెళ్లిపోయారు. అయితే, వారందరు మరికొన్ని రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. కాగా, సోమవారం వృద్ధ మహిళకు కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను కూడా డిశ్చార్జ్ చేశారు.

అయితే, వృద్ధ మహిళను ఇంటికి తీసుకువెళ్లేందుకు వారి కుటుంబీకులు నిరాకరించినట్లు వైద్యులు తెలిపారు. ఇంకొద్ది రోజుల పాటు ఆమెను ఆస్పత్రిలోనే ఉండానివ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా మరో నెలరోజుల పాటు వారిపట్ల జాగ్రత్తగా ఉండాల్సిన నేపథ్యంలో చాలా మంది ఇంటికి వెళ్లేందుకు భయపడుతున్నట్లుగా గాంధీ వైద్యులు వెల్లడించారు. అయితే, గతంలోనూ ఇటువంటి కేసులు చాలా వచ్చాయని చెప్పారు.హోంక్వారంటైన్ ఇష్టపడని 62 మంది రోగులను బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలిపారు. ఇప్పుడు తాజాగా కోలుకున్న 93 ఏళ్ల మహిళను కూడా తరలించేందుకు ప్రభుత్వంతో చర్చించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు.