
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆదివారం నాటికి దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 16వేల మార్క్ దాటింది.గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1324 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16116కు చేరింది. ఇక వీరిలో ఇప్పటి వరకు 519 మరణించారు. గడిచిన 24 గంటల్లో 31మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 13295 కేసులు యాక్టివ్‌లో ఉన్నట్లు తెలిపింది.
ఇప్పటి వరకు 2302 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. వీరిలో 287 మంది తాజాగా డిశ్చార్జ్ అయిన వారే. అయితే దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంటే.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తగ్గుముఖం పడుతోంది. అందులోమణిపూర్ రాష్ట్రంలో రెండు మాత్రమే కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ వచ్చిన ఇద్దరు కూడా కరోనా నుంచి బయటపడ్డట్లు ఆ రాష్ట్ర సీఎం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు లేవని స్పష్టం చేశారు. ఇక గోవా కూడా. ప్రస్తుతం కరోనాను జయించే దిశగా ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం అంతా కరోనా నుంచి బయటపడ్డట్లు అధికారులు చెబుతున్‌నారు.