రాజ్‌భ‌వ‌న్‌లో న‌లుగురు ఉద్యోగుల‌కు క‌రోనా పాజిటివ్

కరోనా కేసుల‌ ఉధృతి కొన‌సాగుతోంది. తాజాగా రాజ్‌భ‌వ‌న్ ఉద్యోగులకు కరోనా సోకింది. రాజ్‌భ‌వ‌న్‌లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

రాజ్‌భ‌వ‌న్‌లో న‌లుగురు ఉద్యోగుల‌కు క‌రోనా పాజిటివ్

Updated on: Apr 27, 2020 | 1:08 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా కేసుల‌ ఉధృతి కొన‌సాగుతోంది. తాజాగా ఏపీ రాజ్‌భ‌వ‌న్ ఉద్యోగులకు కరోనా సోకింది. రాజ్‌భ‌వ‌న్‌లో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళ‌న మొద‌లైంది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు జాగ్ర‌త్త చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు.

ఏపీ రాజ్‌భ‌వ‌న్‌లో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. రాజ్ భవన్‌లో విధులు నిర్వహిస్తున్న నలుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. సిబ్బందిలో కొందరికి అనుమానిత లక్షణాలు కనిపించడంతో గవర్నర్‌ సహా 8 మందికి వైద్యపరీక్షలు నిర్వహించారు. వారిలో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వైద్యసిబ్బందిలో ఒకరి ద్వారా వైరస్ వ్యాప్తి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా సోకిన వారిలో గవర్నర్ కు చీఫ్ సెక్యూరిటీ సిబ్బందిగా విధులను నిర్వహిస్తున్న  వ్యక్తికి, మెడికల్ స్టాఫ్ (ఓ నర్స్)  ఉన్నారని అధికారులు తెలిపారు. అలాగే ఓ బట్లర్, హౌస్ కీపింగ్ స్టాఫ్ కు కూడా వైరస్ సోకిందని తెలిపారు. ఈ విషయం తెలియగానే తనకు కూడా పరీక్షలు చేయాలని గవర్నర్ స్వయంగా కోరారని రాష్ట్ర వైద్య విభాగం వెల్లడించింది.
మరోవైపు వైసీపీ ఎంపీ కుటుంబానికి సైతం కరోనా సోకిందని తేలింది. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన కర్నూలు జిల్లాలో వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లో ఆరుగురు కుటుంబసభ్యులకు కరోనా పాజిటివ్‌గా  తేలింది. ఎంపీ తండ్రితో పాటు, ఇద్దరు సోదరులు, వారి సతీమణులు, ఒకరి కుమారుడు ఉన్నారు. ఎంపీ తండ్రి పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న‌ట్లుగా అధికారులు వెల్ల‌డించారు. కాగా, వీరి ఫ్యామిలీలో వైర‌స్ బారిన ఈ ఆరుగురిలో నలుగురు వైద్యులుగా తెలుస్తోంది.