ఇండియాలో వివిధ ప్రాంతాల్లో తాజాగా 18 కరోనా కేసులు నమోదు కావడంతో వీటి సంఖ్య 180 కి పెరిగింది. మహారాష్ట్రలో 49 కేసులు నమోదయ్యాయి. ప్రజలు సాధ్యమైనంతవరకు ఇళ్ల నుంచి బయటికి రావద్దని సీఎం ఉధ్ధవ్ థాక్రే సూచించారు. సింగపూర్ నుంచి వఛ్చిన ఆరుగురు వ్యక్తులు లోకల్ ట్రెయిన్ లో ప్రయాణిస్తుండగా ముంబైలో క్వారంటైన్ స్టాంప్ వేసి రైలు నుంచి దింపివేశారు. ఇలాగే జర్మనీ వఛ్చిన నలుగురిని పాల్గర్ రైల్వే స్టేషన్ లో గరీబ్ రథ్ నుంచి బలవంతంగా దింపివేశారు. ముంబైలోని డబ్బావాలాలు తమ సర్వీసులను ఈ నెల 31 వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కోల్ కతా విమానాశ్రయంలో ఇద్దరు ఇమ్మిగ్రేషన్ అధికారులను క్వారంటైన్ హోంకి తరలించారు. చెన్నై విమానాశ్రయంలో 50 అంతర్జాతీయ విమానాలను, 34 దేశీయ విమానాలను రద్దు చేశారు.
తిరుమలలో భక్తులకు శ్రీవారి దర్శనాలను నిలిపివేశారు. ఒడిశాలో పూరీ జగన్నాథాలయాన్ని ఈ నెల 31 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రాష్ట్రంలోని చర్చీలలో అన్ని కార్యకలాపాలను నిలిపివేశారు. అహ్మదాబాద్ లోని గాంధీ ఆశ్రమంలోకి విజిటర్లను అనుమతించడంలేదు. జర్మనీ నుంచి వఛ్చిన ఓ వృధ్ధుడు కరోనా కారణంగా పంజాబ్ లో ప్రాణాలు కోల్పోయాడు. యూపీ లో 19 కరోనా కేసులు నమోదయ్యాయి.
స్పైస్ జెట్ ఇంటర్నేషనల్ సర్వీసులకు బ్రేక్
కరోనా వ్యాప్తి కారణంగా స్పైస్ జెట్ తన అంతర్జాతీయ సర్వీసులను ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 30 వరకు నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇది తాత్కాలికమేనని, పరిస్థితి మెరుగు పడిన అనంతరం తిరిగి వీటిని పునరుధ్ధరిస్తామని పేర్కొంది. ఇక ఇండిగో విమాన సంస్థ తమ సీనియర్ ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సంస్థ సీఈఓ రంజయ్ దత్తా స్వయంగా తన వేతనంలో 25 శాతం కోత విధించుకుంటున్నట్టు వెల్లడించారు. ఎయిర్ లైన్స్ ఆదాయాలు పడిపోతున్న కారణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఈ-మెయిల్ ద్వారా తెలిపారు.