భ‌యం గుప్పిట్లో భాగ్య‌న‌గ‌రం…ఈ న‌గ‌రానికి ఏమైంది..?

భ‌యం గుప్పిట్లో భాగ్య‌న‌గ‌రం...ఈ న‌గ‌రానికి ఏమైంది..?

భాగ్య‌న‌గ‌రం భ‌య‌ప‌డిపోతోంది. న‌గ‌ర‌వాసుల‌కు కంటిమీద కునుకులేకుండా పోతోంది. మ‌హ‌మ్మారి క‌రోనా హైద‌రాబాద్‌ను హ‌డ‌లెత్తిస్తోంది.

Jyothi Gadda

|

May 12, 2020 | 12:30 PM

క‌రోనా వైర‌స్ దేశంలో అంత‌కంత‌కు వేగంగా వ్యాపిస్తోంది. గ‌త నెల‌లో కాస్త నెమ్మ‌దిగా క‌రోనా వ్యాప్తి చెంద‌గా..ఈ నెల‌లో మాత్రం వైర‌స్ వ్యాప్తి విప‌రీతంగా ఉంద‌ని కేంద్రం వెల్ల‌డించింది. ఏప్రిల్ నెల‌లో రోజుకు స‌గ‌టున 1,073 కేసులు న‌మోదు కాగా, మే 11వ తేదీన నాటికి రోజుకు స‌గ‌టున 3,409 కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపింది. అంటే గ‌త నెల‌తో పోలిస్తే..ఈ నెల‌లో క‌రోనా దాదాపు మూడు రెట్ల క‌న్నా ఎక్కువ వేగంతో వ్యాపిస్తూ అంద‌రినీ భ‌య‌పెడుతోంది. ఇక తెలంగాణ‌లో వైర‌స్ వ్యాప్తిని ప‌రిశీలించిన‌ట్ల‌యితే..తెలంగాణ‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1275కు చేరింది. ఇందులో ఎక్కువ‌గా హైద‌రాబాద్ గ్రేట‌ర్ ప‌రిధిలోనే న‌మోదు కావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది.

గత కొద్ది రోజులుగా తెలంగాణ‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త త‌గ్గిన‌ట్లుగా క‌నిపించినా…మళ్లీ పెరుగుతోంది. ఒక్క రోజులోనే 79 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 21న 56 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. కొత్తగా నమోదైన కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోవే కాగా.. వీరిలో 13 మంది 15 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనే ఈ కేసులన్నీ నమోదయ్యాయి.

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలోని బేగం బజార్, గడ్డి అన్నారం, జియాగుడ, కిషన్‌బాగ్ ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఒక్క జియాగుడలోనే 26 కొత్త కేసులు నమోదయ్యాయని సమాచారం. దీంతో ఆ ప్రాంతంలోని షాపులన్నింటినీ మూసివేయించిన పోలీసులు..లాక్‌డౌన్ మ‌రింత క‌ఠినంగా అమ‌లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ‌లాంటి హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో వైర‌స్ వ్యాప్తి స్థానికుల్లో వ‌ణుకుపుట్టిస్తోంది. ప్ర‌భుత్వం ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా..పెద్ద ఎత్తున కేసులు న‌మోదు కావ‌టాన్ని ఎందుకు నిరోదించ‌లేక‌పోతున్నార‌నే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వేర్వేరు ప్రాంతాల నుండి కొంద‌రు గుట్టుచ‌ప్పుడు కాకుండా వ‌స్తున్న కార‌ణంగా కేసులు న‌మోదు అవుతున్నాయ‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఇక‌పోతే న‌గ‌రంలోని కొన్ని ప్రాంతాల్లో ప్ర‌జ‌లు వైర‌స్ ప‌ట్ల పెద్ద ప‌ట్టింపులు లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, కొన్ని చోట్ల పోలీసుల నిఘా అంత ఎక్కువ‌గా లేక‌పోవ‌టం కూడా కేసులు పెరిగిపోవ‌టానికి కార‌ణ‌మ‌న్న విమ‌ర్శ‌లు కూడా వినిపిస్తున్నాయి.  ఏదేమైనా తాజాగా న‌మోదైన కేసులు మాత్రం హైద‌రాబాదీయుల్లో వైర‌స్ వ‌ణుకు ప‌ట్టిస్తోంది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu