కరోనా పుణ్యమా అని యూపీలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలోని విద్యార్థులు సంబరాలు చేసుకునే పనిలో పడ్డారు. ఇందుకు కారణం ఈ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి 8 వ తరగతి వరకు విద్యార్థులు పరీక్షల ‘బెడద’ లేకుండా హాయిగా పాసయిపోవచ్చు. వీరినందరినీ ఏకంగా ప్రమోట్ చేసేస్తారు. నిజానికి ఈ ప్రాథమిక స్కూళ్లలో పరీక్షలు ఈ నెల 23 నుంచి 28 వరకు జరగాల్సి ఉంది. అయితే కోవిడ్-19 నేపథ్యంలో.. విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే అన్ని ప్రైమరీ స్కూళ్లలో ఫస్ట్ క్లాస్ నుంచి 8 వరకు పరీక్షలు నిర్వహించబోవడంలేదని ఈ శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ రేణుకా కుమార్ తెలిపారు. అన్ని స్కూళ్లను ఏప్రిల్ 2 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను, మల్టీ ప్లెక్సులు, టూరిస్టు ప్రదేశాల మూసివేతను ఏప్రిల్ 2 వరకు పొడిగించారు. కాంపిటీటివ్, ఇతర పరీక్షలను ఏప్రిల్ 2 వరకు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.