New Corona Cases in Yadadri Temple: యాదాద్రి ఆలయంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 35 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యాయి. అక్కడ ఇటీవలే బ్రహ్మోత్సవాలు జరిగాయి. అందులో పాల్గొన్న అర్చకులు, సిబ్బందిలో కలవరం మొదలైంది. కొత్తగా రికార్డయిన 35 కేసుల్ని కలుపుకుంటే.. మొత్తం పాజిటివ్‌ల సంఖ్య 68కు చేరింది.
యాదాద్రిలో ఇవాళ 35 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న 33 మందికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అప్పుడే అధికార యంత్రాంగం నియంత్రణ చర్యలు చేపట్టింది. ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. స్వామి వారి నిత్యపూజలన్నీ… ఆంతరంగికంగా నిర్వహించాలని నిర్ణయించారు. భక్తులకు లఘు దర్శనం మాత్రమే కల్పిస్తున్నారు.
ఇక తెలంగాణలోనూ కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కువగా బడులు, గుడుల్లోనే కేసులు నమోదవుతున్నాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు కొత్తగా మరో 495 కేసులు నమోదైతే…వైరస్ బారినపడి ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,241కి చేరింది. ఇప్పటి వరకు కరోనాతో 1685మంది ప్రాణాలు విడిచారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసుల సంఖ్య భయపెడుతోంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 15మంది విద్యార్ధులు మహమ్మారి బారినపడ్డారు. నారాయణపురం మండలం అల్లందేవిచెరువులో ఒకరు మృతి చెందారు. కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాలో 110కేసులు నమోదయ్యాయి.