CM KCR key meeting : జీహెచ్ఎంసీ పరిధిలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీంతో ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కొవిడ్-19 పరీక్షలు చేయిస్తోంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జూలై 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై జరగనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్ కట్టడి కోసం లాక్‌డౌన్ విధించే అంశంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న తరహాలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా 15 రోజుల పాటు అత్యంత కఠినంగా లాక్‌డౌన్ విధించాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
లాక్‌డౌన్‌లో భాగంగా అత్యంత కఠినంగా కర్ఫ్యూ విధించాలని.., రోజుకు కేవలం గంట నుంచి రెండు గంటలు మాత్రమే నిత్యావసరాల కోసం సడలింపులివ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చింది. లాక్‌డౌన్ అమలుకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు ఆ తర్వాత ఏర్పడనున్న పరిణామాలను మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. జూలై 3 నుంచి జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్‌డౌన్ విధించే అవకాశముందనే.. ఊహాగానాలు వినిపిస్తున్నాయి.