Covid Third Wave: కొవిడ్ థర్డ్ వేవ్ భయాలు… వ్యాక్సినేషన్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

|

Jun 11, 2021 | 8:01 AM

India Covid Vaccination: కేంద్ర ప్రభుత్వ డేటా మేరకు దేశంలో సరాసరిగా 82 శాతం మంది హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ తొలి డోస్‌ ఇవ్వగా.. 56 శాతం మందికి మాత్రమే సెకండ్ డోస్ కూడా పూర్తయ్యింది.

Covid Third Wave: కొవిడ్ థర్డ్ వేవ్ భయాలు... వ్యాక్సినేషన్‌పై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
Covid Vaccine
Follow us on

కరోనా సెకండ్ వేవ్ కుదుటపడుతున్న వేళ.. థర్డ్ వేవ్ భయం దడపుట్టిస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాలు థర్డ్ వేవ్ సన్నద్ధతపై దృష్టిసారించాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు రెండు డోసుల వ్యాక్సినేషన్‌ను త్వరగా పూర్తి చేయాలని కేంద్రం సూచించింది. గురువారంనాటి ఉన్నత స్థాయి ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమావేశంలో ఫ్రంట్‌లైన్ వారియర్స్, హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్‌పై చర్చించారు. వీరికి వీలైనంత త్వరగా రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టిసారించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర  ఆరోగ్య శాఖ కోరింది. దీనికి సంబంధించి పటిష్ట ప్రణాళికలను అమలు చేయాలని, వీరి కోసం ప్రత్యేక టైమ్ స్లాట్స్, సెషన్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు.

కేంద్ర ప్రభుత్వ డేటా మేరకు దేశంలో సరాసరిగా 82 శాతం మంది హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ తొలి డోస్‌ ఇవ్వగా.. 56 శాతం మందికి మాత్రమే సెకండ్ డోస్ కూడా పూర్తయ్యింది. హెల్త్ కేర్ వర్కర్లకు దేశ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ చేసిన రాష్ట్రాల జాబితాలో పంజాబ్, మహారాష్ట్ర, హర్యానా, తమిళనాడు, ఢిల్లీ, అసోం సహా 18 రాష్ట్రాలున్నాయి.

అటు ఫ్రంట్‌లైన్ వర్కర్లకు దేశంలో సగటున 85 శాతం మందికి మొదటి డోస్‌ను పూర్తి చేయగా… సెకండ్ డోస్‌ కేవలం 47 శాతం మందికి మాత్రమే పూర్తయ్యింది. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు దేశ సగటు కంటే తక్కువగా సెకండ్ డోస్ పూర్తి చేసిన రాష్ట్రాల జాబితాలో 19 రాష్ట్రాలున్నాయి. ఈ జాబితాలో బీహార్, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలున్నాయి. కొవిడ్-19ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలైనంత త్వరగా అందరు హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.

Covid Vaccine

అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రైవేటు ఆస్పత్రుల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరముందని, ఆ దిశగానూ రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని రాజేష్ భూషణ్ సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు కోవిన్‌లో మార్పులు చేసినట్లు తెలిపారు

అందరికీ వ్యాక్సిన్..అందరికీ ఆరోగ్యం టీవీ9 నినాదం. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు ఆయా రాష్ట్రాలు వీలైనంత త్వరగా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని టీవీ9 కోరుకుంటోంది.

ఇవి కూడా చదవండి. 

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సోమవారం నుంచి స్టూడెంట్ వీసాల ప్రక్రియ.. తొలుత వారికి మాత్రమే ప్రాధాన్యం!

టీకా తీసుకుంటేనే పాలసీ ఇస్తారా?.. కొత్త నిబంధనలు తీసుకువస్తున్న బీమా కంపెనీలు