సెంట్రల్ అండ్ వెస్టర్న్ రైల్వే సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఏసీ బోగీల్లో ప్రయాణించే వారు.. ఎవరి బెడ్ షీట్లు వారే తెచ్చుకోవాలని సూచించింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఏసీ బోగీల్లోని కర్టెన్లను మొత్తం తొలగించాలని.. దిండ్లు, బెడ్ షీట్లు ఎవరికీ ఇవ్వరాదని నిర్ణయం తీసుకున్నట్లు వెస్టర్న్ రైల్వే పీఆర్వో తెలిపారు.
ఎవరైనా కరోనా వైరస్ సోకిన వ్యక్తులు ట్రైన్ ఎక్కితే.. అప్పుడు కర్టెన్లు, దిండ్లు, బెడ్‌షీట్ల ద్వారా ఈ వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వెస్టర్న్ రైల్వేతో పాటుగా.. సెంట్రల్ రైల్వే ఏసీ బోగీల్లోని కర్టెన్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక త్వరలో మిగతా రైల్వే జోన్స్ కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా.. ప్రయాణికులు ఎవరి దుప్పట్లను వాళ్లే తెచ్చుకోవచ్చని ఈ సందర్భంగా రైల్వేశాఖ సూచనలు చేసింది. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్‌తో ఇప్పటికే నాలుగు వేల మందికి పైగా మృతిచెందగా.. లక్షన్నరకు పైగా ఈ మహమ్మారి సోకి చికిత్స పొందుతున్నారు.