దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు 10 లక్షల 38 వేల 716 కేసులు నమోదు కాగా, 26,273 మంది కరోనాతో మరణించారు. అత్యధికంగా మహారాష్ట్రలో 11,452 మంది మృతిచెందారు. ఆ తర్వాత ఢిల్లీలో 3571 మంది కరోనా బారినపడి మృత్యువాతపడ్డారు. తమిళనాడులో 2236, గుజరాత్లో 2108, కర్ణాటకలో 1147, ఉత్తరప్రదేశ్‌లో 1084, పశ్చమబెంగాల్లో 1023 కరోనా మరణాలు సంభవించాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు ఏపీలో 543 మంది వైరస్ కారణంగా మరణిస్తే..తెలంగాణలో 403 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే, దేశంలోని తొమ్మిది ప్రధాన నగారాల్లో బెంగళూరు, హైదరాబాద్, పుణేల్లో ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి అత్యంత వేగంగా వ్యాప్తిచెందుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
గత నాలుగు వారాల గణాంకాలను విశ్లేషిస్తే కొత్త పట్టణ కేంద్రాలు, రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు వైరస్ వ్యాపిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. చెన్నై నగరంలో మహమ్మారి మందగించినట్లు కనిపిస్తోంది, కానీ, బెంగళూరులో మాత్రం వైరస్ ఉధృతి కొనసాగుతుందని చెబుతున్నారు. బెంగళూరులో పాజిటివ్ కేసులు గత నాలుగు వారాల్లోనే 12.9 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో మరణాలు కూడా 8.9 శాతం పెరుగుదల నమోదయ్యింది. దీంతో బెంగళూరు నగరం కరోనా హాట్‌స్పాట్‌గా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరో వైపు హైదరాబాద్‌లోనూ వైరస్ సంక్రమణ అత్యంత వేగంగా విస్తరిస్తోందని, ప్రజలు తప్పని సరి నిబంధనలు పాటించాలని చెబుతున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. మిలియన్‌కు 2,061 కేసులు నమోదవుతున్నాయి. అలాగే మిలియన్‌కు 36 మంది చనిపోతున్నారు. భాగ్యనగరంలో కేసుల శాతం 7.8 శాతం ఉంది. బెంగళూరు, హైదరాబాద్ తర్వాత కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నజాబితాలో పూణే, సూరత్, కోల్‌కతా. ఢిల్లీ, చెన్నై. ముంబై, అహ్మదాబాద్ ఉన్నాయి.
ముంబయి, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌లలో వైరస్ సంక్రమణ తగ్గుముఖం పట్టినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్‌లోని థానే, కళ్యాణ్, నవీ ముంబై, భివాండి శాటిలైట్ టౌన్‌షిప్‌లలో మాత్రం వైరస్ వ్యాప్తి పెరుగుదల కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అహ్మదాబాద్‌లో జాతీయ సగటు కంటే చాలా తక్కువ రేటు కేసులు నమోదవుతుంటే… సూరత్‌లో మాత్రం జాతీయ సగటును మించి నమోదవుతున్నాయి.