Mask Must Even if 2 Doses Vaccinated: రోజుకో కొత్త రూపం దాల్చుతున్న కరోనా వైరస్ నియంత్రణలో వ్యాక్సిన్ పాత్ర ఎంతవరకు అన్న దానిపై చర్చ మరోసారి మొదటికి వచ్చింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు ఏమేర ఎదుర్కొంటాయన్న దానిపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా కీలక సూచన చేశారు. టీకా రెండు డోసులు తీసుకున్నప్పటికీ.. మాస్కులు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే, భౌతిక దూరం సైతం పాటించాలన్నారు. వైరస్ రోజురోజుకీ కొత్తరూపు సంతరించుకుంటున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు. కొత్త వేరియంట్లపై వ్యాక్సిన్ల సామర్థ్యం ఎంత అన్నది ఇంకా తెలియదన్నారు. అయితే, వైరస్ నియంత్రణలో భాగంగా కోవిడ్ నిబంధనలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఏ వేరియంట్ బారి నుంచైనా మాస్కు, భౌతిక దూరం రక్షిస్తాయని గులేరియా స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు సూచించారు. అలాగే, టీకా తీసుకున్నవారు మాస్కులు ధరించాల్సిన అవసరం లేదన్న అంశాన్ని ఇప్పుడప్పుడే మార్గదర్శకాల్లో చేర్చబోమని కేంద్ర ఆరోగ్య శాఖలోని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం తొందరపాటు అవుతుందన్నారు. ఇంకా వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగానే ఉన్న నేపథ్యంలో మాస్కులు పక్కనబెట్టడం సురక్షితం కాదని స్పష్టం చేశారు.
కరోనా టీకాలు తీసుకున్న వ్యక్తులకు ఇకపై మాస్కు అవసరం లేదని అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ) ప్రకటించింది. కొవిడ్ 19 రెండు డోసులు తీసుకున్నవారు ఎలాంటి ఆంక్షలు లేకుండా తమ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చని సీడీసీ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ రెండు డోసులు తీసుకున్నవారు మాస్కులు ధరించాల్సిన అసవరం లేదా? అన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో గులేరియా తాజా సూచనలు చేశారు.
ఇదిలావుంటే, రానున్న 2 నెలల్లో భారీ మోత్తంలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని, వ్యాక్సిన్ తయారీదారులు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారని ఎయిమ్స్ డైరక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. విదేశాల నుంచి కూడా వ్యాక్సిన్లను దిగుమతి చేసుకుంటూనే, దేశీయంగా ఉత్పత్తి పెంచడంపై దృష్టి సారించామని అయన అన్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ల ఉత్పత్తి దేశంలో చాలా ప్లాంట్లలో జరగుతుందని అది తర్వలో అందుబాట్లోకి వస్తుందని అన్నారు. భారత్ బయోటెక్, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొత్త ప్లాంట్లు పెడుతున్నాయనీ అంటున్నారు రణ్ దీప్ గులేరియా. జులై ఆగస్టు నాటికి భారీ సంఖ్యలో వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.