ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి. రోజురోజుకీ కేసుల సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు పరుస్తోంది. అందులోనూ ఏపీలో పలువురు రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బందిపై కూడా కరోనా ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే నిడదవోలు ఎమ్మెల్యే గన్‌మెన్‌గా పనిచేస్తున్న చింతలపూడికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. దీంతో నిడదవోలు ఎమ్మెల్యే కూడా కోవిడ్ టెస్టులు చేసుకున్నారు. ఆయనకి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. అలాగే చింతలపూడిలో ఎమ్మెల్యే గన్‌మెన్ ఇంటి ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు అధికారులు.
కాగా ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 491 పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,452కు చేరింది. ఇందులో రాష్ట్రంలో కొత్తగా 390 కేసులు నమోదు కాగా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 83 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో 18 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో రాష్ట్రంలో ఐదు మరణాలు సంభవించాయి. అందులో కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూల్‌లో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 101కి చేరింది. అలాగే 4,240 యాక్టివ్ కేసులు ఉన్నాయి.