Corona Free Village: పశ్చిమ పల్లెల్లో పాగా వేసిన మహమ్మారి ఆ ఊరివంక కన్నెత్తి చూడక పోవటానికి కారణం అక్కడ ప్రజల స్వియనియత్రణ . ఊరంతా ఒక్కమాటపై ఉండటం . ఇపుడు అదే అఊరికి అవార్డు ను సైతం దక్కిన్చుకునేలా చేసింది.
ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి ధాటికి విలవిలలాడుతోంది. అయితే ఆ గ్రామాలు మాత్రం వైరస్ గాలి సోకకుండా ప్రశాంతంగా ఉన్నాయి. రోగం జాడే లేకుండా ఆ పల్లెవాసుల కట్టుబాట్లు రక్షణగా నిలిచాయి. ఇదెక్కడంటే… పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని గుండెపల్లి గ్రామం. ఈ ఊరులో 332 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. గ్రామ జనాభా 1,275 మంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా ఆ ఊరిలో మాత్రం ఇప్పటివరకు అడుగుపెట్టలేదు. దానికి కారణం ఆ ఊరి సర్పంచ్ కలం ప్రసాద్ చొరవ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ప్రజలలో అవగాహన తీసుకురావటమే. దీంతో ఆ గ్రామంలో కరోనా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
దేశ మొత్తం కరోనా వణికిస్తున్న వేళ వైరస్ సోకకుండా ఉండేందుకు ముందు నుండే పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇంటింటికి తిరిగి కరోనాపై అవగాహన కల్పించారు. గ్రామంలో ఎవరూ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయటకురావద్దని గ్రామస్తులకు సూచించారు. అంతేకాక, గ్రామంలోకి కొత్తవారిని బంధువులు ఎవరిని అనుమతించకూడదని కఠిన ఆంక్షలు విధించుకున్నారు. గ్రామంలో చిన్న పిల్లలు, వృద్ధులు ఇళ్ల నుంచి బయటకు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. గ్రామంలో ప్రతి ఒక్కరికి మాస్కులు పంపిణీ చేసి, ఇంటింటికి తిరుగుతూ పారిశుద్ధ్య కార్యక్రమాలపై అవగాహన పెంచారు. దీంతో గ్రామస్థులు చైతన్యవంతులై నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు.
గుండెపల్లి గ్రామానికి రావడానికి, గ్రామం నుంచి బయటకు వెళ్లడానికి రెండు దారులు ఉన్నాయి. రోజుకు ఇద్దరు వాలంటీర్లు, ఆశా కార్యకర్త, ఏఎన్‌ఎంలకు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. గ్రామం నుంచి అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారికి శానిటైజేషన్ చేసి పంపిస్తున్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించేలా చూస్తున్నారు. బయట వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించడం లేదు. అత్యవసరమైతే మాస్కులు ధరించిన వారిని చేతులకు శానిటేషన్ చేసి అనుమతిస్తున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పనులు చేసే ప్రాంతంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. గ్రామంలో ఎప్పటికప్పుడు శానిటేషన్ పనులతో పాటు మంచినీటి ట్యాంకును క్రమం తప్పకుండా శుభ్రం చేయడంతో పాటు క్లోరినేషన్ చేస్తున్నారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లో కోవిడ్ నియత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి తెలుసుకుంది. పంచాయతి రాజ్ కమీషనర్ గిరిజా శంకర్ గ్రామ సర్పంచ్‌లతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు. ఈ క్రమంలోనే గుండెపల్లి గ్రామంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలుసుకున్న ఆయన గ్రామ సర్పంచ్ ప్రసాద్‌కు ప్రభుత్వం తరుపున అవార్డ్ ప్రకటించారు. గ్రామంలోకి కరోనా రాకపోవటం, అంతేకాదు గ్రామానికి అవార్డ రావటం అక్కడి ప్రజలకు మరింత సంతోషం కలిగిస్తుంది.
కాగా, పశ్చిమ గోదావరి జిల్లాలోని గుండేపల్లి ఇపుడు అందరికి ఆదర్శంగా మారింది. ప్రతి ఒక్కరు ఇలా ముందు జాగ్రతలు పాటిస్తే కరోనా తమ దరిచేరదని మరోసారి ఈ గ్రామం నిరూపిస్తోంది.