CBSE: పదో తరగతి పరీక్ష ఫలితాలు వెల్లడించలేదని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిప్రకారం ఆన్‌లైన్‌లో ఎటువంటి ఫలితాలు ఉండవని స్పష్టం చేసింది. కేవలం ప్రాక్టికల్ మార్కులు, థియరీ పరీక్షల ఫలితాలను మాత్రమే పాఠశాలలకు తెలియజేశామని సీబీఎస్ఈ ప్రతినిధి రామశర్మ ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి CBSE జాయింట్ సెక్రటరీ సన్యామ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. 10, 12 తరగతులకు సంబంధించిన టర్మ్ 1, టర్మ్ 2 పరీక్షలు పూర్తికాకుండా ఫలితాలను విడుదల చేయలేమని చెప్పారు. ఫలితాల ప్రకటన అంటే ఏదైనా సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత లేదా ఫెయిల్ కావడం లేదా కంపార్ట్‌మెంట్ పొందడం గురించి విద్యార్థులకు సమాచారం అందించడం. అయితే ఇది టర్మ్ 2 పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే బోర్డు వెబ్‌సైట్‌లో విడుదల చేస్తుంది. ఎడ్యుకేషన్ ఈ మెయిల్ ఐడిల ద్వారా పాఠశాలలకు పంపిన మార్కుల విషయానికొస్తే ఇవి కేవలం థియరీ స్కోర్‌లు మాత్రమేనని, వీటిని సిబిఎస్‌ఈ పాఠశాలలకు పంపించిందని భరద్వాజ్ తెలిపారు.
అయితే 10, 12 బోర్డు ఫలితాలు ఎప్పుడు వస్తాయని అడిగిన ప్రశ్నకి భరద్వాజ్ సమాధానం చెప్పారు. పరీక్ష పూర్తయిన తర్వాతే తుది ఫలితాలను CBSE విడుదల చేస్తుందని అన్నారు. విద్యార్థులు తమ టర్మ్ 2 పరీక్షకు హాజరు కానప్పుడు ఫలితాలు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. రెండో సెషన్ పరీక్షల మార్కులతో పాటు పూర్తి ఫలితాలు ప్రకటిస్తామని వెల్లడించారు. ఈరోజు విడుదల చేసిన థియరీ మార్కుల వల్ల టర్మ్ 2 పరీక్షలో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తారని తెలిపారు. అంతేకాకుండా 12వ తరగతి టర్మ్ 1కి కూడా థియరీ స్కోర్‌లను సిద్ధం చేసే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అయితే వాటిని పాఠశాలలకు పంపడానికి కొంత సమయం పడుతుందన్నారు. టర్మ్ 1 థియరీలో విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారని, టర్మ్ 2లో మరింత మెరుగ్గా రాణించగలరని కోరారు. CBSE బోర్డు పరీక్షలు రెండు టర్మ్‌లలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. టర్మ్ 2 బోర్డు పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమవుతాయి.