
అమరావతి, జనవరి 3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యావిధానంలో పలు కీలక మార్పులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పదో తరగతి, ఇంటర్ తరగతులలో ఎన్సీఈఆర్టీ విద్యావిధానానికి అనుగుణంగా కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి మార్కుల జాబితాలో అదనంగా మరో కీలక మార్పు తీసుకురానున్నట్లు వెల్లడించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి మార్కుల జాబితాలో ఒకేషనల్ సబ్జెక్టు మార్కులను కూడా చేర్చనున్నట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఇక నుంచి మార్కుల గ్రేడింగ్‌లో వృత్తివిద్య కోర్సు కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వెల్లడించారు.
ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి నైపుణ్య పోటీ 2025–26లో 26 జిల్లాల నుంచి 10 ట్రేడ్‌లలో 260 ప్రాజెక్టులు పాల్గొన్నాయి. ఈ పోటీల ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ఉన్నత పాఠశాలల్లో ఒకేషనల్ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టేందుకు బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. వృత్తి విద్యను ఒక అదనపు సబ్జెక్టుగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదిగా మార్చాలని నిర్ణయించినట్లు తెలిపారు. వృత్తి విద్య విద్యార్థులను మాన్యువల్ కార్మికులుగా పరిమితం చేయడానికి కాదు. భవిష్యత్తులో వారిని ఆటోమొబైల్ ఇంజనీర్లు, ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులుగా పెంచడం కోసం ఉద్దేశించబడిందని వివరించారు.
జాతీయ విద్యా విధానం (NEP) 2020 నుంచి ప్రేరణ పొంది, ప్రభుత్వం వృత్తి విద్యను ఐచ్ఛిక యాడ్-ఆన్ నుంచి విద్యార్థుల భవిష్యత్ కెరీర్‌లకు బలమైన పునాదిగా మార్చాలని నిర్ణయించిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వృత్తి విద్యను ప్రవేశపెట్టడానికి బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వృత్తి శిక్షకుల ఎంపిక ఖచ్చితంగా కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) ద్వారా, మెరిట్ ఆధారంగా నిర్వహిస్తామని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో వృత్తి విద్యా కోర్సులో శిక్షణ పొందిన విద్యార్థులు స్వయంగా వారే రూపొందించిన దుస్తులను ధరించి ర్యాంప్ వాక్ చేసి అలరించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ట్రేడ్‌ల వారీగా బహుమతులు ప్రధానం చేశారు. ప్రథమ బహుమతి పొందిన వారికి రూ.25వేలు, ద్వితీయ బహుమతికి రూ.15 వేలు, తృతీయ బహుమతికి రూ.10 వేలు చొప్పున నగదు, పతకాలు అందజేశారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.