పేదరికం వెక్కిరించినా పట్టుదలతో సర్కార్ కొలువు కొట్టాడు.. ఓ కూరగాయల వ్యాపారి కొడుకు కథ!
ఓ వైపు పేదరికం.. అద్దె ఇల్లు.. గంపెడు సంసారం.. అయినా అతని గురి సర్కార్ కొలువుపైనే నిలిచింది. తల్లిదండ్రులు, అన్న రోజంతా కష్టపడి సంపాధించినా ఇల్లు గడవని పరిస్థితి. ఇవేమీ అతని లక్ష్యాన్ని మార్చలేకపోయాయి. కసిగా రాత్రింబగళ్లు చదివి కలల కొలువు దక్కించుకున్న ఓ కూరగాయల వ్యాపారి కొడుకు కథ ఇది.. మీరూ తెలుసుకోండి..

మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) జనవరి 18న MP PCS 2022 పరీక్ష తుది ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మొత్తం 394 మంది అభ్యర్థులు పలు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఫలితాల్లో దేవాస్ నివాసి దీపికా పాటిదార్ టాప్ ర్యాంక్‌తో అగ్రస్థానంలో ఉండగా, మరో ఐదుగురు అమ్మాయిలు టాప్-10లో చోటు దక్కించుకున్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిలో పేద, మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన వారు అధిక మంది ఉండటం విశేషం. కానీ దీని వెనుక వారి అకుంటిత కృషి, అంకితభావం ఉందన్నది జగమెరిగిన సత్యం. తమ తలరాతలు మారాలన్న ఏకైక లక్ష్యంతో కష్టపడిచదివి ఈ రోజు అధికారులుగా మారారు. వారిలో ఆశిష్ సింగ్ చౌహాన్ కూడా ఒకరు. ఆశిష్ కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు. కానీ ఇప్పుడు అతను ఓ అధికారి అయ్యాడు. ఆశిష్ విజయగాథ గురించి మీరూ తెలుసుకోండి..
ఆశిష్.. మధ్యప్రదేశ్ స్టేట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022లో మొత్తం 841.75 మార్కులు సాధించాడు. మెయిన్ పరీక్షలో 738.75 మార్కులు, ఇంటర్వ్యూలో 103 మార్కులు సాధించాడు. తొలి ప్రయత్నంలోనే పాఠశాల విద్యాశాఖలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. మీడియా నివేదికల ప్రకారం.. ఆశిష్ తన విజయానికి మొత్తం క్రెడిట్‌ను తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. తన ఆర్థిక పరిస్థితి బాగా లేదని, తన కుటుంబం మొత్తం ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తోందన్నాడు. అతని తండ్రి కూరగాయల వ్యాపారి, తల్లి గృహిణి. ఆశిష్ అన్న చీరల దుకాణంలో పనిచేస్తున్నాడు. అయితే వీరంతా ఆశిష్‌కి చదువులో సపోర్ట్‌గా నిలవడం వల్లనే ఈ విజయం తనకు దక్కిందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఆశిష్ తన ప్రాథమిక విద్యను బైరాగఢ్ ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. ఆ తర్వాత హమీదియా కాలేజీలో బీఏ, ఎంఏ చేశాడు. ప్రస్తుతం ఇండోర్‌లో పీహెచ్‌డీ చేస్తున్నాడు. రోజూ 8-10 గంటలు చదువుకునేవాడినని, అయితే పరీక్షలు దగ్గర పడ్డాక సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చదువుకునేవాడిని కాదని, తనకు చేతనైనంత వరకు చదువుకునేవాడినని ఆశిష్ చెబుతున్నాడు.
కాగా మధ్యప్రదేశ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022 ఫలితాల్లో మొత్తం 62 మంది అభ్యర్థులు విద్యా శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో 32 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. అసిస్టెంట్ డైరెక్టర్ విభాగంలో సౌమ్య అసతి అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో ఆశిష్ 26వ స్థానం సాధించగా, ఓవరాల్ ర్యాంక్ 350వ స్థానంలో ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.