కోహ్లి ఆదర్శంతో కోచింగ్‌ లేకుండానే.. UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య 1st అటెంప్ట్‌లోనే ఎలా కొట్టింది.?

పట్టుదల, ప్రణాళిక, క్రమశిక్షణ ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని నిరూపించారు తెలంగాణకు చెందిన యువతి దోనూరు అనన్య రెడ్డి. కేవలం 23 ఏళ్ల వయసులోనే, అది కూడా తొలి ప్రయత్నంలోనే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి ఆల్‌ ఇండియా మూడో ర్యాంక్‌ సాధించారు. ఎలాంటి దీర్ఘకాలిక కోచింగ్‌ లేకుండా సొంతంగా నోట్స్‌ తయారు చేసుకుంటూ, సీనియర్ల సూచనలు తీసుకుంటూ ఆమె సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది..

కోహ్లి ఆదర్శంతో కోచింగ్‌ లేకుండానే.. UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య 1st అటెంప్ట్‌లోనే ఎలా కొట్టింది.?
UPSC Topper Ananya Reddy

Updated on: Sep 11, 2026 | 11:42 AM

దోనూరు అనన్య రెడ్డి తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల గ్రామానికి చెందినవారు. పదో తరగతి వరకు మహబూబ్‌నగర్‌లోని గీతం హైస్కూల్‌లో చదువుకున్నారు. అనంతరం హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్‌ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని మిరాండా హౌస్‌ కాలేజీలో జాగ్రఫీని ప్రధాన సబ్జెక్టుగా తీసుకుని డిగ్రీ చదివారు. అయితే ఇంటర్‌ నుంచే సివిల్‌ సర్వీసెస్‌ లక్ష్యంగా పెట్టుకున్న అనన్య.. డిగ్రీతో పాటు UPSC సన్నద్ధతను కూడా కొనసాగించారు. చిన్నప్పటి నుంచే సమాజానికి సేవ చేయాలనే తపన తనలో ఉండేదని అనన్య చెబుతున్నారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి సివిల్‌ సర్వీసెస్‌ సరైన మార్గమని భావించారు. అందుకే ఇంటర్‌ నుంచే సివిల్స్‌ కోసం ప్రిపరేషన్‌ ప్రారంభించారు. ఢిల్లీలో సివిల్స్‌ కోసం సిద్ధమవుతున్న అనేక మంది విద్యార్థులతో పరిచయం ఏర్పడుతుందని, వారి నుంచి సలహాలు, సూచనలు పొందవచ్చని భావించి అక్కడే డిగ్రీ చదువుతూ పరీక్షకు సిద్ధమయ్యారు. డిగ్రీ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో సివిల్స్‌పై దృష్టి సారించారు.

రోజుకు 12 నుంచి 14 గంటల చదువు..

సివిల్స్‌ ప్రిపరేషన్‌లో అనన్య తనదైన వ్యూహాన్ని అనుసరించారు. కొన్ని రోజుల్లో 12 నుంచి 14 గంటల వరకు చదివేవారు. అయితే ఎక్కువ గంటలు చదవడం కంటే పక్కా ప్రణాళికతో చదవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. తన బలాలు, బలహీనతలను గుర్తించుకుని అందుకు అనుగుణంగా చదువుకున్నారు. ప్రతి అంశాన్ని టాపిక్‌ వారీగా విభజించుకుని ప్రిపరేషన్‌ కొనసాగించారు. రోజూ ఒక టాపిక్‌ను ఎంచుకుని దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే నిద్రపోయేవారని ఆమె చెబుతున్నారు.

సొంతంగా నోట్స్‌ తయారు చేసుకుని.. తొలి ప్రయత్నంలోనే 3వ ర్యాంక్‌!

అనన్య సివిల్స్‌లో ఆంత్రోపాలజీని ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. మొదట ఆ సబ్జెక్టులో కోచింగ్‌ తీసుకున్నప్పటికీ, ఆ తర్వాత ఎక్కువగా సొంతంగానే చదువుకున్నారు. చదివిన అంశాలను స్వయంగా నోట్స్‌గా తయారు చేసుకున్నారు. ప్రతిరోజూ దినపత్రికలు, మ్యాగజైన్లు చదవడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా గమనించేవారు. సివిల్స్‌ పరీక్షలో కరెంట్‌ అఫైర్స్‌ ప్రాధాన్యాన్ని గుర్తించి సమకాలీన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సాధారణంగా సివిల్స్‌ పరీక్షలో విజయం సాధించేందుకు చాలామంది అభ్యర్థులు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటిది అనన్య మాత్రం తొలి ప్రయత్నంలోనే ఆల్‌ ఇండియా మూడో ర్యాంక్‌ సాధించి సత్తా చాటారు. తనకు మంచి ర్యాంక్‌ వస్తుందని భావించినప్పటికీ, ఏకంగా మూడో ర్యాంక్‌ వస్తుందని ఊహించలేదని అనన్య తెలిపారు. ఈ ఫలితం తనకు ఎంతో గర్వంగా ఉందని చెప్పారు. తన కుటుంబంలో ఎవరూ సివిల్‌ సర్వీసెస్‌లో లేకపోయినా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఈ రంగంలోకి అడుగుపెట్టానని తెలిపారు. తాను కష్టపడి చదివినందుకు మంచి ఫలితం దక్కిందని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

అనన్యకు స్ఫూర్తి ఎవరో తెలుసా?

సివిల్స్‌లో అద్భుత విజయం సాధించిన అనన్యకు స్ఫూర్తి ఎవరో తెలుసా? టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ అని ఆమె చెబుతున్నారు. ఫలితం ఎలా ఉన్నా ప్రయత్నం మాత్రం ఆపకూడదని, ఓటమికి భయపడకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలనే కోహ్లీ ఆలోచనా విధానం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని తెలిపారు. ఆయన నుంచి స్ఫూర్తి పొందుతూ తాను మోటివేట్‌ అయ్యేవారినని చెప్పారు. పరీక్షల కారణంగా ఇటీవల క్రికెట్‌, సినిమాలకు దూరంగా ఉన్నానని.. ఇకపై సమయం దొరికినప్పుడల్లా క్రికెట్‌, సినిమాలను ఆస్వాదిస్తానని అనన్య తెలిపారు. సివిల్‌ సర్వీసెస్‌ ద్వారా తన చిన్ననాటి కల అయిన సమాజ సేవను కొనసాగించాలనేది అనన్య లక్ష్యం. ముఖ్యంగా పేదలకు తన వంతు సహాయం చేసి, వారి జీవితాల్లో ముందుకు వెళ్లేందుకు తోడ్పడాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా తనను ఎంతో ప్రోత్సహించారని అనన్య తెలిపారు. ఆమె తండ్రి సురేష్‌ రెడ్డి వ్యాపారం చేస్తుండగా, తల్లి మంజులత గృహిణి. రెండో కుమార్తె అయిన అనన్యకు సివిల్స్‌ లక్ష్యంపై తల్లిదండ్రులు పూర్తి మద్దతు ఇచ్చారు.

యువతకు స్ఫూర్తిగా అనన్య

చిన్న వయసులోనే తొలి ప్రయత్నంలో సివిల్స్‌లో మూడో ర్యాంక్‌ సాధించడం ద్వారా అనన్య రెడ్డి ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచారు. సరైన ప్రణాళిక, క్రమశిక్షణతో పాటు నిరంతర శ్రమ ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఆమె విజయం మరోసారి నిరూపించింది. ‘పట్టుదలతో నిరంతరం ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమే’ అనే సందేశాన్ని తన విజయంతో అనన్య రెడ్డి దేశవ్యాప్తంగా సివిల్స్‌ అభ్యర్థులకు అందించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us