
దేశంలోనే అత్యంత కఠినమైన యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 ఫలితాలు ఏప్రిల్ 22న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో మొత్తం 1009 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు యుపీఎస్సీ ప్రకటించింది. యుపీఎస్సీ హర్షిత గోయల్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో మెరిశారు. చార్టర్డ్ అకౌంటెంట్ అయిన హర్షిత ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా ప్రిపరేషన్ సాగించి తొలి ప్రయత్నంలోనే టాప్ సెకండ్ ర్యాంకు సాధించారు. అందుకు కారణం స్వీయ అధ్యయనంతోపాటు మాక్ టెస్ట్‌లేనని చెబుతున్నారు. కోచింగ్ సెంటర్ నుంచి కేవలం ఫౌండేషన్ కోర్సు మాత్రమే చేసింది. ఆ తరువాత టెస్ట్ సిరీస్‌లపై దృష్టి సారించి విజయాన్ని సాధించినట్లు తన సక్సెస్ సీక్రెట్‌ను చెబుతున్నారు.
హర్షిత గోయల్ స్వస్థలం హర్యానా. అయితే గుజరాత్‌లోని వడోదరలోనే పెరిగారు. ప్రాథమిక విద్యా అక్కడే పూర్తి చేశారు. యూనివర్సిటీ బరోడా నుంచి MS, బికామ్ డిగ్రీలు చేశారు. ఆ తర్వాత సీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యారు. కానీ ఆమె కల అంతటితో తీరలేదు. ఐఏఎస్ కావడమే ధ్యేయంగా పెట్టుకున్న ఆమె దాని కోసం పక్కా వ్యూహంతో సిద్ధం కావడం ప్రారంభించింది. పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ సబ్జెక్టులను సివిల్స్‌లో ప్రధాన సబ్జెక్టులుగా ఎంచుకుని విజయం సాధించారు. అంతేకాకుండా తన విజయంలో సోషల్ మీడియా కూడా ప్రధానపాత్ర పోషించిందని అన్నారు. ఉపయోగకరమైన, విద్యాపరమైన ఇన్‌స్టాగ్రామ్ సైట్‌లను అనుసరించానని అన్నారు. వినోదాన్ని పంచే సామాజిక మాధ్యమాలను సరిగ్గా ఉపయోగించడం వల్ల ప్రభావవంతమైన అభ్యాస సాధనాలుగా ఎలా మారుతాయో ఆమె వివరించారు.
హర్షిత గోయల్ మాట్లాడుతూ.. కలెక్టర్‌గా ప్రజల జీవితాలను మెరుగుపరుచడానికి కృషి చేస్తానని అన్నారు. మహిళలను ముందుకు తీసుకెళ్లాలని, వారికి ప్రేరణగా మారాలని కోరుకుంటున్నానని అన్నారు. మహిళలు ముందుకు వచ్చి అన్నింటా తమ ప్రతిభను కనబరచుకోవాలని అన్నారు. మురికివాడల్లో నివసించే పిల్లల కోసం కూడా తాను పనిచేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాలను.. ఏమాత్రం సౌకర్యాలు లేని పిల్లలను చేరుకునేలా కృషి చేస్తానన్నారు. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వ పథకాలకు, పేద పిల్లలకు మధ్య వారధిగా పనిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ప్రధాని మోదీ అభివృద్ధి చెందిన దేశం పట్ల చూపిన దార్శనికతకు తాను ముగ్ధుడినయ్యానని, అందుకు తన వంతు తోడ్పాటు అందిస్తానని హర్షిత గోయల్ అన్నారు. తన విజయానికి తన తండ్రి కృషి కారణమని ఆమె అన్నారు. నేను ఏది సాధించినా అది నా తండ్రి వల్లే అని ఆమె చెబుతోంది. CA పూర్తి చేసిన తర్వాత, విజన్ IAS నుంచి ఫౌండేషన్ కోర్సు చేసినట్లు తెలిపారు. మెయిన్స్ కోసం లెక్కకుమించి టెస్ట్ సిరీస్‌లు రాశానని, అలాగే పలు రకాల మాక్ ఇంటర్వ్యూలను అటెంప్ట్ చేసినట్లు ప్రిపరేషన్ విధానం గురించి వివరించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.