ఢిల్లీ, జూన్ 20: నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NTA) మరో బాంబ్ పేల్చింది. దేశ వ్యాప్తంగా రగులుతోన్న నీట్ యూజీ పరీక్ష వ్యవహారం ఒక కొలిక్కి రాకముందే మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 18వ తేదీన నిర్వహించిన యూజీసీ నెట్ -2024 పరీక్ష రద్దు చేసింది. ఈ మేరకు పరీక్షను రద్దు చేస్తున్నట్లు కేంద్ర విద్యాశాఖ బుధవారం అధికారిక ప్రకటన వెలువరించింది. పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ నివేదికలు వెల్లడించినందున యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్డీ లలో ప్రవేశాలకు కోసం జరిగే ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఎన్టీయే తీరుపై దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) డేటా ప్రకారం.. మంగళవారం (జూన్ 18) దేశ వ్యాప్తంగా దాదాపు 9,08,580 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 1,205 సెంటర్లలో ఈ పరీక్ష జరిగింది. అయితే పరీక్ష జరిగిన ఒక రోజు తర్వాత ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C)కు చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్.. పరీక్ష నిర్వహణలో తప్పటడుగులు వేసినట్లు గుర్తించింది. దీంతో పరీక్షల్లో పారదర్శకతను కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఈ పరీక్షలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. పరీక్షల పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని, త్వరలో కొత్త తేదీలను ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.
కాగా ఇప్పటికే వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నిర్వహించిన నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీపై వ్యవహారంపై అట్టుడుగుతోన్న వేళ మరో పరీక్షను రద్దు చేయడం తీవ్ర దుమారం లేపుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందని, అక్రమాలకు పాల్పడిన నేరస్తులు ఎవరైనా విడిచిబెట్టబోమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రతిష్టాత్మక పరీక్షల నిర్వహణలో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అసమర్ధతను ప్రతి ఒక్కరూ ఏకిపారేస్తున్నారు. విద్యార్ధుల జీవితాలతో చలగాటం అడుతున్న ఎన్టీయేకు పరీక్షలను నిర్వహించే అర్హతలేదంటూ మండిపడుతున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.