న్యూఢిల్లీ, ఆగస్టు 15: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2024 (యూజీసీ- నెట్ జూన్ 2024) పరీక్ష తేదీల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటన జారీ చేసింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు ఆగస్టు 21, 22, 23, 26, 28, 29, 30, సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు యూజీసీ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే శ్రీకృష్ణజన్మాష్టమి కారణంగా ఆగస్టు 26వ తేదీన సెలవు వచ్చింది. దీంతో ఈ రోజున జరగాల్సిన పరీక్షను వాయిదా వేసి, పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేసింది. ఆగస్టు 26వ తేదీన నిర్వహించవల్సిన ఆ పరీక్షను ఆగస్టు 27న నిర్వహిస్తున్నట్లు ఎన్‌టీఏ వెల్లడించింది. ఈ పరీక్షలు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 83 సబ్జెక్టుల్లో జరగనున్నాయి.
జూనియర్ రిసెర్చి ఫెలోషిప్ అవార్డు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు ప్రతీయేట యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తారు. ఈ ఏడాది తొలి విడతలో విడుదల చేసిన నెట్ నోటిఫికేషన్‌కు ఏప్రిల్ 20 నుంచి మే 10 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 9,08,580 మంది విద్యార్ధులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. జూన్ 18వ తేదీన మొత్తం 1,200 కేంద్రాలలో పెన్ను, పేపర్ విధానంలో పరీక్ష కూడా నిర్వహించారు. అయితే పరీక్ష జరిగిన 24 గంటల్లోపే పేపర్ లీక్ ఆరోపణలు రావడంతో కేంద్ర విద్యాశాఖ ఈ పరీక్షను రద్దు చేసింది. డార్క్ నెట్‌లో యూజీపీ నెట్‌కు సంబంధించిన క్వశ్చన్ పేపర్లు ప్రత్యక్షమైంది. దీంతో నెట్ పరీక్షను యూజీసీ రద్దు చేసింది. ఈ పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు తాజాగా షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈసారి ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది.
యూజీనీ నెట్ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు జరుగుతుంది. రెండు పేపర్లలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష మొత్తం 3 గంటల వ్యవధిలో జరుగుతుంది.రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
UGC- NET June 2024 అధికారిక వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.