PhD courses: విద్యార్ధులకు అలర్ట్.. ఆ 3 యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ కోర్సులపై UGC నిషేధం!

దేశంలోని మూడు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలపై యూజీసీ కొరడా విసిరింది. పీహెచ్ డీ ప్రవేశాల్లో యూజీసీ నిబంధనలు అనుసరించనట్లు గుర్తించిన యూజీసీ ఈ మేరకు వచ్చే ఐదేళ్ల పాటు ఈ మూడు యూనివర్సిటీల్లో PhD ప్రవేశాలు నిర్వహించకుండా నిషేధం విధిస్తూ ప్రకటన జారీ చేసింది..

PhD courses: విద్యార్ధులకు అలర్ట్.. ఆ 3 యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ కోర్సులపై UGC నిషేధం!
UGC Bans Three Universities

Updated on: Jan 17, 2025 | 2:34 PM

న్యూఢిల్లీ, జనవరి 17: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) రాజస్థాన్‌లోని మూడు యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలను నిషేధించింది. వచ్చే ఐదేళ్ల వరకు ఈ 3 యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ కోర్సులు నిర్వహించకుండా సస్పెండ్ చేస్తూ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి 2029-30 వరకు ఇది అమలులో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విశ్వవిద్యాలయాలల్లో పీహెచ్‌డీ ప్రవేశాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. చురులోని ఓపీజేఎస్, అల్వార్‌లోని సన్‌రైజ్, ఝుంఝునూలోని సింఘానియా వర్సిటీలపై ఈ చర్య తీసుకుంది. ఈ మూడు యూనివర్సిటీలు యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా పీహెచ్‌డీ కోర్సులు నిర్వహిస్తున్నాయని, అందుకే వీటిపై పిషేధం విధించినట్లు యూజీసీ కార్యదర్శి మనీశ్‌ జోషి తెలిపారు. వీటిలో ప్రవేశాలు పొందవద్దని విద్యార్థులకు, తల్లిదండ్రులకు యూజీసీ స్పష్టం చేసింది.

యూనివర్శిటీలను పర్యవేక్షించేందుకు యూజీసీ ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ నిర్ణయం మేరకు యూనివర్సిటీలను డీబార్ చేసినట్లు యూజీసీ వెల్లడించింది. యూనివర్సిటీలు యూజీసీ నిబంధనలకు అనుగుణంగా పీహెచ్‌డీ పట్టాలను ప్రదానం చేస్తున్నాయో లేదో పర్యవేక్షించేందుకు యూజీపీ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. దిద్దుబాటు చర్యలను సూచించడం, తప్పు చేసిన విశ్వవిద్యాలయాలపై చర్య తీసుకోవడానికి సిఫారసు చేయడం ఈ స్టాండింగ్ కమిటీ కార్యకలాపాలలో ముఖ్యమైనవి.

పై మూడు యూనివర్సిటీలు సమర్పించిన సమాచారం, డేటాను విశ్లేషించి, మూల్యాంకనం చేసిన తర్వాత, మూడు విశ్వవిద్యాలయాలు UGC పీహెచ్‌డీ నిబంధనలను పాటించలేదని స్టాండింగ్ కమిటీ గుర్తించింది. యూజీసీ సూచించిన నిబంధనలను పాటించడంలో ఎందుకు విఫలమయ్యారో వివరించడానికి ఈ యూనివర్సిటీలకు అవకాశం ఇచ్చాం. కానీ ఆయా వర్సిటీలు సమర్పించిన ప్రతిస్పందనలు సంతృప్తికరంగా లేనందున UGC తదుపరి ఐదేళ్లపాటు PhD కోర్సులు నిర్వహించకుండా నిషేధించాం. పై మూడు విశ్వవిద్యాలయాలు అందించే పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ఇక నుంచి అడ్మిషన్ తీసుకోవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచిస్తున్నాం. ఇవి అందించే పీహెచ్‌డీ సర్టిఫికెట్లను ఉన్నత విద్య, ఉపాధి విషయంలో చెల్లుబాటుగా పరిగణించబడదు’ అని యూజీసీ తన అధికారకి ప్రకనటలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.