TSPSC: త్వరలో తెలంగాణలో వరుసగా ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదలకానున్నాయి. ఇప్పటికే సర్కారు ప్రకటించిన 80,039 ఉద్యోగాల్లో భాగంగా 30,453 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇందులో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్3, గ్రూప్4 పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌లో అభ్యర్థులు ఇబ్బందిపడుతున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చింది. అందువల్ల అభ్యర్థులకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. వాస్తవానికి 1 నుంచి 7 తరగతుల్లో చివరి నాలుగేళ్లు(4-7 తరగతులు) చదివిన జిల్లానే స్థానికంగా పరిగణిస్తారు. గతంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సమయంలో లోకల్, నాన్‌లోకల్ అని కేవలం ప్రస్తావించేవారు. ఉద్యోగాలకు ఎంపికైన తర్వాత ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉండేది. ఈసారి ధ్రువీకరణ పత్రాలను ముందుగానే సమర్పించాల్సి రావడం, స్థానికతను గుర్తించేందుకు బోనఫైడ్ సర్టిఫికెట్‌లే కొలమానం కావడంతో వీటి కోసం నిరుద్యోగులు నానా అవస్థలు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకొంది. వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)లో సర్టిఫికెట్ల అప్‌డేట్ అనేది తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో మార్పులు కూడా చేసింది. ఓటీఆర్‌లో విద్యార్హత వివరాలు నమోదు చేస్తే సరిపోతుందని.. సర్టిఫికెట్లు అప్‌లోడ్ చేయడం అభ్యర్థుల ఇష్టమని సూచించింది. ఒకవేళ సర్టిఫికెట్ అప్‌లోడ్ చేయకున్నా ఓటీఆర్ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. ఈ తాజా నిర్ణయంతో నిరుద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఉద్యోగంలో చేరే సమయంలో ఒరిజినల్స్ కచ్చితంగా సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.