హైదరాబాద్, మే 2: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది ఫిబ్రవరి నెల 19వ తేదీన నోటిఫికేషన్ వెలువరించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించింది. జూన్ 9వ తేదీన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. అయితే ఈ పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుందా లేదా ఆఫ్‌లైన్‌లో జరగుతుందా అనే విషయంపై ఇప్పటి వరకూ కమిషన్ స్పష్టత ఇవ్వలేదు. దీనిపై తాజాగా టీఎస్పీయస్సీ క్లారిటీ ఇచ్చింది. జూన్ 9వ తేదీన ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో ఆఫ్‌లైన్ విధానంలోనే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ నవీన్ నికోలస్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ లేదా సీబీఆర్టీలలో ఏదో ఒక పద్ధతిలో నిర్వహించే అవకాశముందని, దీనిపై తుది నిర్ణయాన్ని కమిషన్ తీసుకుంటుందని తొలుత ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో కమిషన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సారి గ్రూప్-1కు భారీ సంఖ్యలో దాదాపు 4.03 లక్షల దరఖాస్తులు వచ్చినందున సీబీఆర్టీ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తే సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయని కమిషన్ భావించింది. అందువల్లనే ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో నిర్ధిష్ట కటాఫ్ సాధించిన వారందరికీ మెయిన్స్ పరీక్షను అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్టు ఇప్పటికే కమిషన్ ప్రకటన వెలువరించింది.
కాగా వరుస పేపర్ లీకేజీల కారణంగా గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కావడంతో రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పోస్టుల సంఖ్యను పెంచి మొత్తం 503 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 46 యేళ్లకు పెంచుతూ జీవో కూడా విడుదల చేసింది. మరికొన్ని పోస్టులకు 35 యేళ్లకు మాత్రమే సడలింపు ఇచ్చింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.