Telangana TS Police Recruitment 2022: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 554 ఎస్సై పోస్టుల భర్తీకి.. ఆదివారం ఉదయం 10గంటలకు ప్రాథమిక రాత పరీక్ష ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) నిర్వహిస్తున్న ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. దీనికోసం పోలీస్ శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 538 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. ఈ మేరకు అభ్యర్థులను 9 గంటల నుంచే పరీక్షా హాలులోకి అనుమతించారు. హాల్‌టికెట్లు, ఐడీ కార్డుల పరిశీలించి తనిఖీలు నిర్వహించిన అనంతరం లోపలికి పంపించారు. కాగా.. రాష్ట్రంలో మొత్తం 554 ఎస్సై పోస్టులకు గాను 2,47,217 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో పోస్టుకు 446 మంది పోటీ పడుతున్నారు.
పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల నుంచి బయోమోట్రిక్ విధానంలో హాజరు తీసుకున్నారు. పరీక్షా పరిసరాల్లో సీసీటీవి కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. ఆయా జిల్లాల పరిధిలో ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు స్వయంగా పరీక్ష ఏర్పాట్లను పర్యవేక్షించారు.
కాగా.. పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు అంతకుముందే సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమంటూ స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..