TSLPRB FSL Exam Date 2026: నిరుద్యోగులకు అలర్ట్.. ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్
రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (టీజీఎఫ్ఎస్ఎల్)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల షెడ్యూలును తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) చైర్మన్ వివి శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. గత నెల 20 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో..

హైదరాబాద్: ఫిబ్రవరి 18: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (టీజీఎఫ్ఎస్ఎల్)లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల షెడ్యూలును తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) చైర్మన్ వివి శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. గత నెల 20 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో మొత్తం 4,664 మంది అభ్యర్థులకుగాను 3,760 మంది హాజరై తమ ధృవపత్రాలను పరిశీలించుకున్నట్లు తెలిపారు. అభ్యర్థుల నుంచి సేకరించిన సమాచారం నిబంధనల ప్రకారం మెరిట్ మార్కులు, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఒక్కో పోస్టుకు 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపిక చేసినట్లు బోర్డు చైర్మన్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన కట్-ఆఫ్ మార్కులు, ఎంపికైన వారి వివరాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
షెడ్యూలు ప్రకారం ఈ రాత పరీక్షలు మార్చి 5, 6, 7 తేదీలలో హైదరాబాద్‌లోని మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో జరగనున్నాయి. ప్రతి టెక్నికల్ పేపర్ పరీక్షా సమయం ఒక గంట మాత్రమే ఉంటుందని, మధ్యలో అభ్యర్థులను బయటకు అనుమతించబోమని బోర్డు చైర్మన్ స్పష్టం చేశారు. పరీక్షా విధానం పూర్తిగా వివరణాత్మక (డిస్క్రిప్టివ్) పద్ధతిలో ఉండి, మొత్తం 10 ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు సుమారు 100 పదాలలో సమాధానం ఇవ్వాల్సి ఉంది. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయడం తప్పనిసరి. ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు కేటాయిస్తారు. ఆ మార్కులను నోటిఫికేషన్‌లో పేర్కొన్న వెయిటేజీ ప్రకారం తుది మెరిట్ లెక్కింపునకు పరిగణనలోకి తీసుకుంటారు.
పరీక్షల సమయపాలన విషయానికి వస్తే మార్చి 5న మూడు సెషన్లలో సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ (ఫిజికల్/జనరల్, కంప్యూటర్స్), ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు పరీక్షలు నిర్వహిస్తారు. మార్చి 6న కెమికల్ విభాగానికి చెందిన సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు, మార్చి 7న బయాలజీ/సెరోలజీ విభాగాలకు చెందిన వివిధ పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి. కాగా రాత పరీక్షకు ఎంపిక కాని అభ్యర్థులకు తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు వెసులుబాటు కల్పించామని తెలియజేశారు. అర్హత విషయంలో ఏవైనా వివరణలు చేయాలని భావిస్తే ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా ఒక్కో పోస్టుకు రూ. 500 చొప్పున ఫీజు చెల్లించి వివరణ కోరాల్సి ఉంటుంది. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ తదితర వివరాలను త్వరలోనే వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




