Tanikella Bharani : ఆ డైరెక్టర్ టార్చర్ చేస్తే ఏడ్చేవాన్ని.. ఇప్పుడు అతడికే థ్యాంక్స్ చెప్తున్నా.. కారణం ఇదే..
టాలీవుడ్ విలక్షణ నటుడు తనికెళ్ల భరణి తన నటనా ప్రస్థానంలో దర్శకుడితో తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన్ టార్చర్ పెట్టినప్పుడు తాను ఏడ్చేవాడినని, కానీ అది తనను రాటుదేల్చిందని, ఇప్పుడు కృతజ్ఞుణ్ణని తెలిపారు. కోట శ్రీనివాసరావు గొప్ప నటుడని, ఆయనతో పోటీ లేదని స్పష్టం చేస్తూ, తన సహాయకులకు చేసిన తోడ్పాటు గురించి వివరించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, తన సినీ జీవితంలోని కీలక మలుపులను, ముఖ్యమైన వ్యక్తులతో తనకున్న అనుబంధాలను తాజాగా వెల్లడించారు. దర్శకుడు వంశీతో తనకున్న ప్రయాణాన్ని, సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పట్ల తనకున్న గౌరవాన్ని, అలాగే తన సహాయకులకు అండగా నిలిచిన విధానాన్ని ఆయన వివరించారు. తన సినీ ప్రస్థానంలో దర్శకుడు వంశీ కీలక పాత్ర పోషించారని తనికెళ్ల భరణి తెలిపారు. వంశీ తనను టార్చర్ పెట్టినప్పుడు తాను కన్నీళ్లు పెట్టుకునేవాడినని, స్క్రిప్టు చిరిగిపోతుందని బాల్‌పెన్‌తో రాసేవాడినని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో అది ఒక ఫిర్యాదుగా అనిపించినా, ఇప్పుడు తనను ఎంతగానో రాటుదేల్చిందని, తన ఎదుగుదలకు అది ఒక కారణమని ఆయన భావిస్తున్నారు. వంశీకి తన సంస్కృత భాషా జ్ఞానం నచ్చి, తనను ఎంతగానో గౌరవించారని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమలో ఎవరైనా ఏదైనా చేస్తే, అది ద్వేషంతో కాదని, కేవలం అవసరార్థం మాత్రమే అని, ఈ సత్యాన్ని తాను తర్వాత అర్థం చేసుకున్నానని భరణి చెప్పారు. తిట్లు, కొట్టడాలు అనేవి సినిమా తీసే క్రమంలో చాలా చిన్న విషయాలని, ఒక నటుడిగా, రచయితగా ఆ పరిస్థితులకు తట్టుకుని నిలబడటం ముఖ్యమని ఆయన అన్నారు.
నటుడు ఎల్.బి.శ్రీరామ్‌తో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని భరణి పంచుకున్నారు. నాటక రంగం నుంచే తాము మంచి స్నేహితులమని, పోటీపడి మరీ ఉత్తమ ప్రదర్శనలు ఇచ్చేవారమని తెలిపారు. ఎల్.బి.శ్రీరామ్ వంశీతో ట్యూన్ కాకపోవడంపై భరణి స్పందిస్తూ, “సినిమా అంటే అడ్జస్ట్‌మెంట్. జీవితం అంటేనే ఫస్ట్ పాయింట్ అడ్జస్ట్‌మెంట్. వంశీ గారి తత్వాన్ని పట్టుకుని ఫాలో అవ్వడం కష్టం. ఆయన నచ్చకపోతే ఒకలా ఉంటాడు, నచ్చితే ఇంకోలా ఉంటాడు” అని చెప్పారు. వంశీ తిట్టినా, కొట్టినా, అది సినిమా కోసమేనని, వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరం లేదని, ఎల్.బి.శ్రీరామ్ వంటి సున్నిత మనస్కులకు ఇది అర్థం కాకపోవచ్చని అన్నారు.
తనను కొందరు కోట శ్రీనివాసరావుకు పోటీగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని, అయితే కోట శ్రీనివాసరావు నాకంటే, చాలామందికంటే గొప్ప నటుడని తనికెళ్ల భరణి స్పష్టం చేశారు. ఆయన ఇంట్లోనే ఉండి, ఆయనతో నాటకాలు వేసి, ఆయన చేత అన్నం తిన్న సందర్భాలను గుర్తుచేసుకున్నారు. ఒకానొక సందర్భంలో కోట శ్రీనివాసరావు తనకు ఒక పాత్రను వదులుకోమని సూచించినప్పటికీ, తాను సర్వైవల్ కోసం ఆ పాత్రను చేయక తప్పలేదని తెలిపారు. పాత్రల వల్లనే నటుడు ఎలివేట్ అవుతారని, ప్రకాష్ రాజ్ వంటి నటులు మంచి పాత్రల వల్లనే రాణించగలిగారని భరణి చెప్పుకోచ్చారు. కోట శ్రీనివాసరావు గంభీరమైన, పదునైన పాత్రలను అద్భుతంగా చేయగలరని, తాను సెంటిమెంట్ పాత్రలను బాగా చేయగలనని ఆయన అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : 1965లోనే లక్షలతో తీసిన బాలనాగమ్మ సినిమా.. షూటింగ్ పూర్తైన ఎందుకు రిలీజ్ కాలేదంటే..
ఎక్కువ మంది చదివినవి : Cinema : మెంటలెక్కించే ట్విస్టులు.. క్లైమాక్స్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. ఓటీటీని షేక్ చేస్తున్న 7 ఎపిసోడ్స్..
