TS TET 2022: టెట్‌లో గట్టెక్కకుంటే మా గతేంటి? సీటెట్ మాదిరి ఏడాదికోసారైనా టెట్ నిర్వహించండి మహప్రభో!
తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) ఇటీవల ప్రకటించడంతో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. లక్షల మంది నిరుద్యోగులు ఈ సారైనా ఉపాధ్యాయ కొలువు కల నెరవేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు..
Telangana govt has not conducted TET for past four years: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ (CM KCR) ఇటీవల ప్రకటించడంతో ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ఆశలు చిగురించాయి. లక్షల మంది నిరుద్యోగులు ఈ సారైనా ఉపాధ్యాయ కొలువు కల నెరవేర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అది సాకారం కావాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TS TET 2022)లో విజయం సాధించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. ప్రభుత్వం గత నాలుగేళ్లుగా టెట్ నిర్వహించలేదు. ఏటా టెట్ నిర్వహించి ఉంటే ఎప్పుడో ఒకసారి అర్హత సాధించేవాళ్లమని, తాజా పరీక్షలో నెగ్గకుంటే మళ్లీ ఏళ్ల తరబడి ఎదురుచూడక తప్పదేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ఆవిర్భవించాక ఏటా టెట్ నిర్వహిస్తామంటూ 2015లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జీవో నం.36 జారీ చేశారు. 2016లో, ఆ తర్వాత 2017 జులైలో నిర్వహించారు. ఆ తర్వాత టెట్ నిర్వహణ, కొన్ని నిబంధనల మార్పుపై పాఠశాల విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వ ఆమోదం లభించలేదు. పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు నిబంధనల్లో సవరణలు అవసరమంటూ 2018, మార్చిలో పాఠశాల విద్యాశాఖ సమర్పించిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించలేదు. ఆ సంవత్సరం నుంచి టెట్ నోటిఫికేషన్ వెలువరించలేదు.
బీఈడీ అభ్యర్థులూ 1-5 తరగతుల బోధనకు ఉపాధ్యాయ నియామకాల్లో పోటీపడవచ్చని 2019లో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్‌సీటీఈ) నోటిఫికేషన్ జారీ చేసింది. అందుకు అనుగుణంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్‌జీటీ) పోస్టులకు బీఈడీ అభ్యర్థులు పోటీ పడేందుకు టెట్‌లోని పేపర్-1 రాసేలా నిబంధన మార్చాలని 2019లో అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దానికీ మోక్షం లేదు. రాష్ట్రంలో చివరిసారిగా 2017 జులైలో టెట్ నిర్వహించగా.. ఆ తర్వాత బీఈడీ, డీఎడ్ చేసినవారు దాదాపు 80 వేల మంది ఉన్నారు. గత టెట్‌లో ఉత్తీర్ణులు కానివారు మరో 2 లక్షల మందీ ఈసారి తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. నోటిఫికేషన్లు వెలువడుతున్న సమయాల్లోనే హడావిడిగా టెట్ నిర్వహించడం వల్ల చాలామంది బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హత సాధించలేకపోతున్నారు. సీటెట్‌ను ఏటా రెండుసార్లు నిర్వహించినట్లే తెలంగాణ రాష్ట్రంలో కూడా కనీసం ఏడాదికి ఒక్కసారైనా టెట్ నిర్వహించాలని అభ్యర్ధులు కోరుతున్నారు.
Also Read: