హైదరాబాద్, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్ సెట్-2023) హాల్‌టికెట్లను శుక్రవారం (అక్టోబర్ 20) ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. సెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టీఎస్ సెట్-2023 పరీక్ష అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనున్న సంగతి తెలిసిందే. టీఎస్ సెట్ పరీక్ష రెండు పేపర్లను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.
ఈ రెండు పేపర్లలోని ప్రశ్నలను ఆబ్జెక్టివ్ విధానంలో మాత్రమే ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు ఉంటుంది. పేపర్ 1 పరీక్ష 50 మార్కులకు ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున కేటాయిస్తారు. అలాగే పేపర్ 2 పరీక్షలో వంద ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున కేటాయిస్తారు. పేపర్ 2 పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి కోత విధిస్తారు. కంప్యూటర్ ఆధారిత టెస్టు (సీబీటీ) పద్ధతిలో జరిగే ఈ పరీక్షకు ప్రతీయేట లక్షల్లో అభ్యర్ధులు పరీక్షలు రాస్తుంటారు.
కాగా రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లుగా అర్హత సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతీయేట టీఎస్ సెట్ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. జనరల్ స్టడీస్, 29 సబ్జెక్టుల్లో ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్ష జరుగనుంది. తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రతీయేట నిర్వహిస్తుంటారు. హైదరాబాద్, వరంగల్, కర్నూలు, ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం,రంగారెడ్డి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు తప్పనిసరిగా పరీక్ష కేంద్రానికి హాల్ టికెట్లతోపాటు సంబంధిత గుర్తింపు పత్రాలు కూడా తీసుకురావాలని ఉస్మానియా యూనివర్సిటీ సూచించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.