మెడికల్ సీట్ల భర్తీలో హైకోర్టు కీలక తీర్పు ‘శాశ్వత నివాసితులైతే స్థానికులే.. ఆ నిబంధన వారికి వర్తించదు’

|

Aug 30, 2023 | 9:15 AM

తెలంగాణ రాష్ట్రంలో 2023 –24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీని కౌన్సెలింగ్ నిర్వహిస్తోన్న సంగతి తెలిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలకతీర్పు వెలువరించింది. శాశ్వత నివాసితులైన విద్యార్థులను స్థానికులుగానే పరిగణించాలని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ మెడికల్, డెంటల్‌ కాలేజీల..

మెడికల్ సీట్ల భర్తీలో హైకోర్టు కీలక తీర్పు ‘శాశ్వత నివాసితులైతే స్థానికులే.. ఆ నిబంధన వారికి వర్తించదు’
TS High Court
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 30: తెలంగాణ రాష్ట్రంలో 2023 –24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీని కౌన్సెలింగ్ నిర్వహిస్తోన్న సంగతి తెలిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలకతీర్పు వెలువరించింది. శాశ్వత నివాసితులైన విద్యార్థులను స్థానికులుగానే పరిగణించాలని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ మెడికల్, డెంటల్‌ కాలేజీల అడ్మిషన్‌ 2017లోని 3(GGG)(B) నిబంధనల ప్రకారం విద్యార్ధులను స్థానికులుగా పరిగణించాలంటే నీట్‌ పరీక్షకు ముందు తెలంగాణలోనే నాలుగేళ్లు చదివి ఉండాలి. ఈ నిబంధనను హైకోర్టు తప్పుబట్టింది.

ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘిస్తోందని అభిప్రాయపడింది. ఇలాంటి కేసులను తప్పుబడుతూ గతంలో సుప్రీంకోర్టు సైతం పలు కేసుల్లో ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేసింది. తెలంగాణలోని శాశ్వత నివాసిత విద్యార్ధులకు 3 (జీజీజీ)(బీ) నిబంధన వర్తించదని తేల్చిచెప్పింది. ఐతే ఈ నిబంధనను పూర్తిగా ఎత్తివేయడం కుదరదని పేర్కొంది. ఈ కేసులో పిటిషనర్లు తాము తెలంగాణలో శాశ్వత నివాసితులమని చెబుతున్నారు. అందువల్ల వారు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా సర్టిఫికెట్‌ అందజేస్తే మెరిట్‌ ప్రకారం స్థానిక కోటాలో సీట్లు కేటాయించాలని వర్సిటీని ఆదేశించింది.

అసలు కేసు ఏంటంటే..?

హైదరాబాద్‌కు చెందిన ప్రశంస రాథోడ్‌ అనే విద్యార్థి తల్లిదండ్రులిద్దరూ వృత్తిరిత్యా ప్రభుత్వ ఉద్యోగులు. ప్రశంస రాథోడ్‌ పదో తరగతి పూర్తి చేసిన అనంతరం అతని తల్లిదండ్రులు చెన్నైకి బదిలీ అయ్యారు. దీంతో అతను చెన్నైలోనే ఇంటర్మీడియెట్‌ చదవవల్సి వచ్చింది. ఇంటర్ స్థానికంగా చదవకుంటే లోకల్ కోటా కింద 85 శాతం సీట్ల కేటాయింపు కిందకు రారంటూ వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తెలంగాణలోనే చదువుకున్నా.. ఇంటర్‌ చెన్నైలో చదివినందున ఆ విద్యార్ధి నాన్‌లోకల్‌గా పరిగణిస్తామని సీటు ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. ఇంటర్మీడియెట్‌ స్థానికంగా చదవకుంటే స్థానికులుగా పరిగణించబోమని, వారు నీట్‌లో లోకల్‌ కోటా (85 శాతం) కిందికి రారంటూ పేర్కొన్నారు. లోకల్‌గా పరిగణించకుంటే కేవలం 15 శాతం సీట్లలోనే పోటీ పడాల్సి ఉంటుంది. దీంతో సదరు విద్యార్ధి ప్రభుత్వం తెచ్చిన జీవో 114ను సవాల్ చేస్తు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ తరహా పిటిషన్లు అన్నింటినీ విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.