హైదరాబాద్, మార్చి 29: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో భారీగా బ్యాక్‌లాగ్ పోస్టులు మిగిలిపోతున్నాయి. ఒకే సమయంలో భారీగా ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియలు చేపడుతుండటంతో అర్హత ఉన్న అధిక మంది అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న చాలా మంది అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎంపిక అవుతున్నారు. వాటిలో ఒక పోస్టును ఎంచుకోవడంతో మిగతా ఉద్యోగాలు ఖాళీగా మిగిలిపోతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కాకుండానే మిగిలిపోతున్నాయి. ఉద్యోగ నియామక సంస్థల మధ్య సరైన సమన్వయం కొరవడడం, అన్ని కేటగిరీల్లో ఉద్యోగాల కౌన్సెలింగ్‌ను ఒకే సమయంలో నిర్వహించడం వంటివి కారణాల రిత్యా ఈ పరిస్థితి నెలకొంది. ఒకటికి మించి ఉద్యోగాలకు ఎంపికైనవారు ఒకటిని ఎంచుకుని మిగిలిన వాటిని వదులుకుంటే.. మెరిట్‌లో తర్వాత అభ్యర్థులకు ఆ పోస్టులను కేటాయించే పరిస్థితి (రిలిక్విష్ మెంట్) లేకపోవడం సమస్యకు ప్రధాన కారణం. ఇలా పలు కారణాలతో మిగిలిపోయిన పోస్టులకు మళ్లీ కొత్త నోటిఫికేషన్ జారీ ఇచ్చి భర్తీ చేపట్టాల్సి వస్తోంది. కాగా రాష్ట్రంలో ఇటీవల భర్తీ చేసిన గురుకుల టీచర్ పోస్టులు, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు, స్టాఫ్ నర్స్ పోస్టులు, మెడికల్ ఆఫీసర్ పోస్టులు వంటి పలు పోస్టుల్లో దాదాపు 10 శాతానికిపైగా ఇలా మిగిలిపోయినవే.
రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నెలల్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 33 వేల ఉద్యోగాల భర్తీకి కార్యచరణ చేపట్టింది. వీటిల్లో 4,590 ఉద్యోగాలు మిగిలిపోయాయి. ఇప్పటికీ ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో విధుల్లో చేరలేదు. వారంతా విధుల్లో చేరితే ఇందుకు సంబంధించి మరింత స్పష్టత వస్తుంది. గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డు 8.820 ఉద్యోగాల భర్తీ చేపట్టగా.. వాటిల్లో 1,810 ఉద్యోగాలు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపట్టగా.. అందులో దాదాపు 2వేల ఉద్యోగాలు మిగిలాయి. అటు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. 7000 స్టాఫ్ నర్సు పోస్టుల్లో 1150 మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది. అయితే వీటిల్లో కూడా 780 ఉద్యోగాలు భర్తీకాకుండానే మిగిలిపోయాయి.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఉద్యోగ ఖాళీల భర్తీలో రిలిక్విష్మెంట్ విధానాన్ని 2018 వరకు అనుసరించారు. అయితే ఈ విధానంలో పారదర్శకత లోపించిందంటూ కొందరు కోర్టుకెక్కడంతో రిలిక్విష్మెంట్ విధానానికి మంగళం పాడారు. దీంతో ఇటీవల భర్తీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ రిలిక్విష్మెంట్ అంశాన్ని ప్రస్తావించలేదు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మిగిలిన పోస్టులను అదే నోటిఫికేషన్ కింద భర్తీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన రేవంత్ సర్కార్ రిలిక్విష్మెంట్‌పై ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి, చర్చించింది. కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. దీంతో పేరుకు పోతున్న బ్యాక్‌లాగ్ ఖాళీలను భర్తీ చేయాలంటే మళ్లీ కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.