TS Eamcet Engineering 2022 Exams: ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఎంసెట్ పరీక్షలు నేటితో ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,56,812 మంది ఇంజినీరింగ్ ఎంసెట్ రాశారు. ఈనెల 18 నుంచి నేటి వరకు రోజుకు రెండు పూటల చొప్పున ఈ పరీక్షలు నిర్వహించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 1,72,273 మంది ఇంజినీరింగ్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా 9శాతం మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. కాగా భారీ వర్షాలు, వరదల వల్ల ఈనెల 14, 15న జరగాల్సిన అగ్రికల్చర్ ఎంసెట్‌ను ఈనెల 30, 31కి వాయిదా వేశారు. ఆ పరీక్షలు ముగిసిన తర్వాత రెండింటి ఫలితాలను ఒకేసారి వెల్లడించాలని ఎంసెట్ అధికారులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో వచ్చే నెల 7 తర్వాతే ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది.
కాగా ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేసిన విషయం తెలిసిందే. పాత నిబంధనల ప్రకారం జనరల్ విద్యార్ధులు ఇంటర్‌లో 45 శాతం, మిగిలిన వారు 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందటం తప్పనిసరిగా ఉంది. అంతేకాకుండా ఈ సారి ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ (25% weightage) కూడా ఉండదు. అంటే ఎంసెట్‌లో వచ్చిన మార్కులతోనే ర్యాంక్ కేటాయిస్తారన్నమాట.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..