
హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా కేవలం ఏడాదిన్నరలోపే గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లి వేగంగా నియామకాలను పూర్తి చేసింది. ఈ పోస్టులకు 1:1 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేపట్టడంతోపాటు గ్రూప్-1లో తొలిసారి అభ్యర్థులు పొందిన మార్కులను వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ఉంచింది. పైగా రీకౌంటింగ్‌కు కూడా అవకాశం ఇచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత పూర్తి చేసిన తొలి గ్రూప్ పోస్టులు కూడా ఇవే కావడం విశేషం. ఉమ్మడి రాష్ట్రంలో 2011లో నోటిఫికేషన్ వెలువడింది. అప్పట్లో ఈ నియామక ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగి 2017లో ముగిసింది. దాదాపు ఆరున్నరేళ్లకుపైగా నియామక ప్రక్రియ కొనసాగింది. అప్పట్లో కూడా న్యాయవివాదాల కారణంగా 2 సార్లు రాతపరీక్షలు జరిగాయి. ఇందులో తెలంగాణలో121 మంది ఎంపికయ్యారు.
2024 ఫిబ్రవరిలో 563 పోస్టులతో టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంత పెద్ద స్థాయిలో గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం కూడా ఇదే తొలిసారి. ఆ తర్వాత 4 నెలల్లోనే అంటే జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి, జులై 7న ఫలితాలు వెల్లడించింది. ప్రిలిమ్స్‌లో 31,382 మంది అర్హత సాధించడంతో వారందరికీ మెయిన్స్ పరీక్షలు 2024 అక్టోబరు 21 నుంచి 27 వరకు పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో అభ్యర్థుల మార్కులను ఈ ఏడాది మార్చి 10న వెల్లడించింది. అనంతరం 1:1 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసింది. తుది ఫలితాలు వెల్లడించే సమయానికి న్యాయవివాదాలు చుట్టుముట్టాయి. దీంతో సెప్టెంబర్ నెలాఖరులో గ్రూప్ 1 తుది ఫలితాలు వెలువడ్డాయి. కేవలం 19 నెలల్లో ఈ నియామకాలు పూర్తి చేయడాన్ని టీజీపీఎస్సీ రికార్డుగా పేర్కొంది.
అలాగే గ్రూప్ 2 తుది ఫలితాలను కూడా టీజీపీఎస్సీ వేగంగా ప్రకటించింది. రాతపరీక్ష జరిగిన ఏడాదిలోగా తుది ఫలితాలు వెల్లడయ్యాయి. గతంలో గ్రూప్ 2 తుది ఫలితాలు వెల్లడించడానికి మూడేళ్లు పట్టింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.