హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణలో గ్రూప్ 1 మెయిన్ పరీక్షల నిర్వహనకు టీజీపీఎస్సీ ముమ్మర ఏర్పా్ట్లు చేస్తుంది. ఇప్పటికే హాల్ టికెట్ల విడుదలకు రంగం సిద్ధం చేసింది. అక్టోబర్ 14వ తేదీ నుంచి హాల్ టికెట్లను టీజీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని కమిషన్ సెక్రటరీ నవీన్‌నికోలస్ సూచించారు. పరీక్ష తేదీకి ఒకరోజు ముందు వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు. గ్రూప్-1 ప్రధాన పరీక్షలు హైదరాబాద్ కేంద్రంగా(హెచ్‌ఎండీఏ పరిధిలో) మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని వివరించారు. కాగా అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతామని కమిషన్ వెల్లడించింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే సమయంలో సమస్యలు తలెత్తితే 040-23542185, 040-23542187 నంబర్లను టోల్ ఫ్రీ నంబర్ లేదా కమిషన్ అధికారులను పనిదినాల్లో సంప్రదించవచ్చని అభ్యర్ధులకు సూచించారు. మెయిన్స్ పరీక్షలు హైదరాబాద్ పరిధిలో జరుగనున్నాయి. మొత్తం 563 గ్రూప్1 పోస్టుల భర్తీ ఈ నియామక ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 7 పేపర్లకు మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ప్రతి పేపర్‌కు మూడు గంటల వ్యవధిలో పరీక్షలు జరుగుతాయి. ప్రతి పేపర్ 150 మార్కులకు కేటాయిస్తారు.
ఆయా పరీక్ష తేదీల్లో మధ్యాహ్నం 1:30 గంటల తరువాత గేట్లు మూసివేస్తారు. అభ్యర్థులను మధ్యాహ్నం 12:30 నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు. తొలిరోజు తమతో తెచ్చుకున్న హాల్‌టికెట్‌తోనే మిగతా పరీక్షలకు రావల్సి ఉంటుందని సూచించారు. హాల్‌టికెట్, ప్రశ్నపత్రాలను తుదిప్రక్రియ ముగిసేవరకు తమతోపాటు భద్రపరచుకోవాలని సూచించారు.