
హైదరాబాద్, నవంబర్ 11: తెలంగాణ గ్రూప్ 3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్‌డేట్ అదించింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. గ్రూప్ 3 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నవంబర్ 17, 18 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. నవంబర్ 17వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ 1 పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్ 2 పరీక్ష నిర్వహించనున్నారు. ఇక నవంబర్ 18వ తేదీన పేపర్ 3 పరీక్షను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఇలా మొత్తం 3 పేపర్లకు గ్రూప్ 3 పరీక్షలు జరుగుతాయి.
టీజీపీఎస్సీ గ్రూప్ 3 హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
టీజీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5.36 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. పరీక్ష తేదీల్లో మొదటి సెషన్‌కు ఉదయం 8.30 గంటల నుంచి, రెండో సెషన్‌కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి అభ్యర్ధులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం సెషన్‌లో 9.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌లో 2.30 గంటలకు గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత వచ్చిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు తెలిపారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌నే అన్ని పరీక్షలకు ఉపయోగించాలని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. అంటే పరీక్ష తొలిరోజు పేపర్ 1కు హాజరైన హాల్‌టికెట్‌నే మిగతా పరీక్షలకు కూడా ఉపయోగించాలని టీజీపీఎస్సీ వివరించింది. అలాగే హాల్‌టికెట్లోపాటు ప్రశ్నపత్రాలను కూడా నియామక ప్రక్రియ ముగిసేవరకు భద్రంగా పెట్టుకోవాలని సూచించింది. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌లో ఏమైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే 040-23542185, 040-23542187 ఫోన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొంది. కాగా తెలంగాణలో దాదాపు 1380కిపైగా గ్రూప్ 3 పోస్టులకు ఈ నియామక ప్రక్రియ చేపట్టిన సంగతి తెలిసిందే.