హైదరాబాద్, నవంబర్ 24: తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష బాలారిష్టాలు దాటుకునేదెప్పుడో అర్ధంకాకున్నది. ఇప్పటికే వరుసగా మూడు సార్లు వాయిదా పడిన గ్రూప్ 2 పరీక్ష.. మరోమారు వాయిదాపడే అవకాశం దండిగా ఉంది. అందుకు కారణం.. సరిగ్గా అదే రోజు మరో పరీక్ష కూడా ఉండటమే. అవును.. గ్రూప్ 2కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే టీజీపీఎస్సీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 4 పేపర్లకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఆయా రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్ 1, 3 పరీక్షలు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్ 2, 4 పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే గ్రూప్-2 సర్వీసు పరీక్ష తేదీనే రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) పరీక్షనూ నిర్వహిస్తోంది. ఒకే రోజు ఈ రెండు పరీక్షల నిర్వహణ ఉండటంతో ఏ పరీక్ష రాయాలో తెలియక అభ్యర్థులు గందరగోళ పడుతున్నారు.
డిసెంబర్ 15, 16న గ్రూప్-2 పరీక్షలు ఉండగా.. ఆర్‌ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న పరీక్ష డిసెంబర్ 16న జరగనుంది. గ్రూప్ 2కు హాజరయ్యే అభ్యర్థుల్లో కొందరు ఆర్‌ఆర్‌బీ జేఈ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఈ రెండు పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు ఏదో ఒక పరీక్షను వదులుకోవాల్సి పరిస్థితి నెలకొంది. అభ్యర్ధులు మాత్రం రెండు పరీక్షల్లో ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలని అటు రైల్వే శాఖకు, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మొరపెడుతున్నారు.
ఇదిలా ఉంటే టీజీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబర్ 9 నుంచి విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. మొత్తం 18 విభాగాల్లో 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుని పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు.