TGPSC గ్రూప్‌ 1 ఫలితాలపై హైకోర్టులో తప్పుడు అఫిడవిట్‌.. పిటిషనర్లకు భారీ జరిమానా!

గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూపు 1 మెయిన్‌ పరీక్షల్లో మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి అనుసరించిన విధానంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, రీవాల్యుయేషన్‌ చేసి పారదర్శకంగా ఫలితాలు వెల్లడించేలా టీజీపీఎస్సీని ఆదేశించాలంటూ మొత్తం 19 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ఇటీవల..

TGPSC గ్రూప్‌ 1 ఫలితాలపై హైకోర్టులో తప్పుడు అఫిడవిట్‌.. పిటిషనర్లకు భారీ జరిమానా!
TGPSC Group 1 Case

Updated on: Apr 29, 2025 | 4:17 PM

హైదరాబాద్‌, ఏప్రిల్ 29: తెలంగాణ గ్రూపు 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్ధులు రాష్ట్ర హైకోర్టు తలుపుతట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారు కోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఉన్నట్లు కోర్టు జడ్జి గుర్తించారు. దీంతో పిటిషనర్లకు రూ.20 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు వివరాలు సమర్పించిన పిటిషనర్లపై (ప్రాసిక్యూషన్‌) చర్యలు చేపట్టాలంటూ జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీ చేసింది.

గత ఏడాది అక్టోబరులో నిర్వహించిన గ్రూపు 1 మెయిన్‌ పరీక్షల్లో మూల్యాంకనం, ఫలితాల వెల్లడికి అనుసరించిన విధానంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని, రీవాల్యుయేషన్‌ చేసి పారదర్శకంగా ఫలితాలు వెల్లడించేలా టీజీపీఎస్సీని ఆదేశించాలంటూ మొత్తం 19 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ నగేశ్‌ భీమపాక ఇటీవల విచారణ చేపట్టింది. అయితే విచారణ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ టీజీపీఎస్సీ మూల్యాంకనానికి అనుసరించిన విధానం వల్ల అభ్యర్థులు నష్టపోయారని, కమిషన్‌ జారీ చేసిన మార్కుల మెమోకు, వెబ్‌సైట్‌ నోట్‌కు తేడా ఉందని అన్నారు. అనంతరం కమిషన్‌ తరఫు న్యాయవాది పీఎస్‌ రాజశేఖర్‌ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు తప్పుడు వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేసి కోర్టును తప్పుదోవ పట్టించాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు.

మార్కులు తగ్గాయని పిటిషనర్లు పేర్కొన్న అభ్యర్థి ఎం.రాహుల్‌కు మొత్తం 192.5 మార్కులు వచ్చాయి. కానీ పిటిషనర్ల ప్రకారం పేపర్‌ 7లో 122 వచ్చినప్పటికీ వెబ్‌సైట్‌ నోట్‌లో మాత్రం 100 మార్కులు మాత్రమే ఉన్నాయని, అక్రమాలు జరిగాయంటున్నారు. ఆ అభ్యర్థికి వాస్తవంగా 392.5 మార్కులు వచ్చాయని అఫిడవిట్‌లో పిటిషనర్లు పేర్కొన్నారు. ఇంత అన్యాయం జరిగితే ఆ అభ్యర్థి పేరు పిటిషనర్లలో లేరు. 392.5 మార్కుల నుంచి 192.5 మార్కులకు తగ్గితే సవాలు చేయకుండా ఉండకపోవడం దాదాపు అసాధ్యం. పిటిషనర్లు తప్పుడు మార్కుల జాబితా సృష్టించి కోర్టు ద్వారా ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్నారని వివరించారు. ఇరువురి వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లు నకిలీ డాక్యుమెంట్‌ సృష్టించినట్లు తేలడంతో అధికరణ 226 కింద పిటిషనర్లకు ఎలాంటి ఉపశమనం లభించదంటూ పిటిషన్‌ను కొట్టివేశారు. అలాగే పిటిషనర్లకు రూ.20 వేలు జరిమానా కూడా విధించింది. తప్పుడు వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేసిన పిటిషనర్లపై తగిన చర్యలు తీసుకోవాలని జ్యుడిషియల్‌ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.