హైదరాబాద్, జనవరి 27: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూవర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకోనుంది. వచ్చే ఉద్యోగ క్యాలెండర్‌లో యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టులను కూడా చేర్చేలా యోచిస్తుంది. ఈ మేరకు విన్నవించాలని ఉన్నత విద్యామండలి భావిస్తుంది. అయితే ప్రొఫెసర్ పోస్టుల ఎంపికకు ఎలాంటి విధానం పాటించాలన్న దానిపై ఇప్పటికే కమిటీని కూడా విద్యా మండలి నియమించింది. దీనిలో భాగంగా విద్యామండలి గత డిసెంబరు నాటికి ఆయా వర్సిటీల్లోని ప్రొఫెసర్ పోస్టుల ఖాళీల సంఖ్యను సేకరిస్తోంది. గత నవంబరు వరకు మొత్తం 11 చూవర్సిటీల్లో 2,817 పోస్టులకు గాను 2060 ప్రొఫెసర్ పోస్టుల ఖాళీగా ఉన్నట్లు తేలింది. డిసెంబరు నాటికి ఆ సంఖ్య 2070 వరకు పెరగవచ్చని అంచనా. దానికితోడు కొత్తగా మహిళా వర్సిటీ ఏర్పాటు, పాలమూరులో న్యాయ, ఇంజినీరింగ్ కాలేజీలు రావడంతో మంజూరు చేయాల్సిన పోస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఉపకులపతుల సమావేశం ఉన్నందున ఆ సందర్భంగా వర్సిటీల్లో ఉమ్మడిగా ఉన్న సమస్యలపై ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకృష్టారెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. అప్పుడు నియామకాలపై చర్చసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ పోస్టుల ఖాళీలు భర్తీ చేయకుండా వర్సిటీల స్థాయిని పెంచలేమని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ భావిస్తున్నారు. ఈ నియామకాలను వీలైనంత త్వరగా చేపట్టాలని, కనీసం 50 శాతం ఖాళీలను భర్తీ చేయాలని, వాటిని వచ్చే ఉద్యోగ క్యాలెండర్‌లో చేర్చాలని అంతా భావిస్తున్నారు.
అయితే నియామక విధానం ఎలా ఉంటుందన్న దానిపై ఇంకా కమిటీ నివేదిక ఇవ్వలేదు. వందల మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలిచే బదులు.. వడపోతకు ఉమ్మడి ప్రవేశపరీక్ష నిర్వహించాలని యోచిస్తుంది. ఆ తర్వాత ఒక్కో పోస్టుకు ఇద్దరు, ముగ్గురిని పిలిస్తే మంచిదని భావిస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.