హైదరాబాద్, ఏప్రిల్ 4: తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థల్లో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు త్వరలో నిర్వహించనున్న సమ్మెటివ్ అసెస్‌మెంట్ – 2 పరీక్షలను వాయిదా వేసింది. దీంతో ఈ పరీక్షలను ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు గురువారం (ఏప్రిల్ 4) ప్రకటించారు. తాజా ప్రకటన ప్రకారం సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ 23వ తేదీన ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు ప్రకటించనున్నారు. అనంతరం ఏప్రిల్ 24వ తేదీన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, ఆ మరుసటి రోజు నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తారు.
ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు గల విద్యార్ధులకు ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఇక 8వ తరగతి విద్యార్ధులకు ఉదయం 9 నుంచి 11.45 గంటల వరకు, తొమ్మిదో తరగతి విద్యార్ధులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్ఏ – 2 పరీక్షల వాయిదా వేసినట్లు విద్యాశాఖ అధికారులు అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. డీఈవోలు, స్కూళ్ల యాజమన్యాలు, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.
కాగా 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 2వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఒంటి పూట బడులు జరుగుతున్నాయి. ఏప్రిల్ 24వ తేదీ పాఠశాలలకు చివరి పని దినం. ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. వేసవి సెలవులు ముగిసేలోపు సార్వత్రిక ఎన్నికలు కూడా ముగించేలా ఈసీలు చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి విద్యాశాఖ మొత్తం 45 రోజులు వేసవి సెలవులు ప్రకటించింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.