
హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలు మరోమారు మూతపడనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాల నిర్వహణ సంఘం ప్రకటన వెలువరించింది. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. లేకుంటే అక్టోబర్ 13 నుంచి ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు మూసివేయనున్నట్లు పేర్కొంది. గత నెలలో రూ.900 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ అక్టోబర్ 1 వరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే చెల్లించిందని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ బి. సత్యనారాయణ రెడ్డి తెలిపారు. దసరాకు ముందు మరో రూ.600 కోట్లు, దీపావళికి ముందు అదనంగా రూ.600 కోట్లు విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చారని, కానీ ఇంత వరకు పెండింగ్ బకాయిలు చెల్లించలేదని ఆయన అన్నారు.
మిగిలిన బకాయిలను అక్టోబర్ 12 నాటికి విడుదల చేయాలని, లేదంటే అక్టోబర్ 13 నుంచి అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు మూసివేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సంఘానికి మద్దతు తెలుపుతూ దసరాకు ముందు రూ.1,200 కోట్లు విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ దాదాపు రూ.10 వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించడంలో విఫలమయ్యాయని ఆయన ఆరోపించారు.
కాగా ప్రైవేట్ కాలేజీలు ఫీజు రీయంబర్స్‌మెంట్ అంశంపై సమ్మె చేస్తామని బెదిరించడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను అసోసియేషన్ తో చర్చలు జరిపేందుకు సీఎం రేవంత్ ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఈ వారం కళాశాల యాజమాన్యాలతో సమావేశమయ్యే అవకాశం ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.