హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని పారామెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ పారామెడికల్ బోర్డు అక్టోబరు 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై అక్టోబరు 30వ తేదీలోపు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత జిల్లా డీఎంహెచ్‌వో ఆఫీసుల్లో అందజేయాలని విద్యార్ధులకు సూచించింది. జిల్లాల వారీగా నవంబరు 13లోపు కౌన్సెలింగ్ పూర్తి చేయాలని, నవంబర్ 20వ తేదీలోగా ఎంపిక జాబితా విడుదల చేస్తామని నోటిఫికేషన్‌లో తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చని వివరించింది.
వివాదాల నడుమ తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 46 పరీక్ష కేంద్రాల్లో అక్టోబర్ 22వ తేదీ నుంచి గ్రూప్ 1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. పోలీలసుతోపాటు పాటు జిల్లా కలెక్టర్లు పటిష్ట భద్రత నడుమ ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 22వ తేదీన పేపర్ 1 జనరల్ ఎస్సే పరీక్ష, 23వ తేదీన పేపర్ 2 హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ పరీక్ష, 24వ తేదీన పేపర్ 3 ఇండియన్ సొసైటీ పరీక్షలు జరిగాయి. అయితే ఒక్కో పరీక్షకు అభ్యర్ధుల హాజరు 70 శాతాన్ని మించింది లేదు.
దీనిలో భాగంగా నిన్న (అక్టోబరు 24) జరిగిన పేపర్ 3 ఇండియన్ సొసైటీ, రాజ్యాంగం, గవర్నెన్స్ పరీక్షకు 67.7 శాతం హాజరు నమోదైందని టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్షకు 21,264 మంది మాత్రమే హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు మొత్తం 31,383 మంది అభ్యర్థులు అర్హత సాధిస్తే.. వీరిలో అధిక మంది పరీక్షలకు డుమ్మా కొట్టడం విశేషం. కాగా ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతున్నాయి.