
హైదరాబాద్, ఏప్రిల్ 22: తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఫలితాలు మంగళవారం (ఏప్రిల్ 22) విడుదలైన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో ఫస్టియర్ ఫలితాల్లో 65.96 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అంటే మొత్తం ఫస్టియర్ పరీక్షలకు 4,88,430 మంది హాజరు కాగా.. వారిలో 3,22,191 మంది పాసైయ్యారు. ఇక సెకండియర్ ఫలితాల్లో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్ పరీక్షలకు 5,08,582 మంది హాజరైతే వీరిలో 3,33,908 మంది ఉత్తీర్ణత సాధించారు.
తాజా ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చినవారితోపాటు, ఫెయిల్ అయిన విద్యార్ధులకు కూడా సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశం ఇంటర్ బోర్డు ఇచ్చింది. ఈ పరీక్షలు మే 22, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జూన్ 3 నుంచి జూన్ 6వ తేదీ వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు తాము చదివే కాలేజీల్లో రేపట్నుంచి అంటే ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.