
హైదారాబాద్, మార్చి 5: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాతంగా మొదలయ్యాయి. బుధవారం ఉదయంఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు రెండో భాష పేపర్ 1కు పరీక్ష జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం మూడు గంటల వరకు పరీక్ష జరగగా.. విద్యార్థులను గంట ముందు నుంచే అంటే ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఇక పరీక్ష మొదలయ్యాక 9.05 నిమిషాలకు వచ్చిన విద్యార్ధులను కూడా పరీక్షకు అనుమతించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవాంతరాలు లేకుండా మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. తొలిరోజు పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులకు వాచ్‌లు, సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను లోనికి అనుమతించలేదు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు నేటి నుంచి మార్చి 19వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే.
అలాగే మార్చి 6 నుంచి అంటే రేపట్నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వీరికి మార్చి 20వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9,96,971 విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో ఫస్టియర్‌లో విద్యార్థులు 4,88,448 మంది, సెకండియర్ విద్యార్థులు 5,08,523 మంది ఉన్నారు. ఇక గతంలో ఫెయిలైన విద్యార్థులు 67,735 మంది కూడా ఈసారి పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 1,532 పరీక్ష కేంద్రాల్లో 29,992 మంది ఇన్విజిలెటర్లు, 72 మంది ప్లయింగ్‌స్కాడ్, 124 సిట్టింగ్ స్కాడ్‌లతోపాటు, అబ్జర్వర్లు కూడా ఇంటర్ పరీక్షల విధుల్లో పాల్గొంటున్నారు. ఇక పరీక్షకేంద్రాల వద్ద 100 మీటర్ల దూరంలో బీఎన్‌ఎస్ 163 (144 సెక్షన్) అమల్లో పెడుతున్నారు. ఇది మార్చి 20వ తేదీ వరకు కొనసాగుతుంది. సీసీ కెమెరాల నీడలో పోలీసు బందోబస్తు మధ్య పకడ్భందీగా ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంచిత సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.