
హైదరాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం (ఫిబ్రవరి 3) నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంపీసీ, బైపీసీ సెకండ్ ఇయర్ జనరల్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా సోమవారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే విద్యార్ధులకు ఈ ప్రాక్టికల్ పరీక్షలు మొత్తం నాలుగు దశల్లో జరగనున్నాయి. ఈ నాలుగు దశల్లో ఆయా రోజుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇక ప్రాక్టికల్ పరీక్షలు పూర్తైన తర్వాత ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి మార్చి 19వ తేదీ వరకు జరగనున్నాయి. ఇక ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 6 నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. హాల్‌టికెట్లలో ముద్రించిన తేదీలు, సమయాన్ని బట్టి విద్యార్థులు పరీక్షలకు జాగ్రత్తగా హాజరుకావాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. కాగా ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,90,987 మంది విద్యార్థులు ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.