Telangana: ఇక ఇంటర్ ఎగ్జామ్స్‌లో అక్రమాలకు చెక్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం..!

ఇంటర్ పరీక్షణల నిర్వహణలో కీలక సంస్కరణలకు తెలంగాణ ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది. ఇంటర్ పరీక్షల్లో అక్రమాలకు తావులేకుండా పలు పగడ్భందీ చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా క్వశ్చన్ పేపర్ లీక్‌ను అరికట్టేందుకు వీటిపై క్యూఆర్ కోడ్ ముద్రించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

Telangana: ఇక ఇంటర్ ఎగ్జామ్స్‌లో అక్రమాలకు చెక్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం..!
Telangana Inter

Edited By: Janardhan Veluru

Updated on: Jan 18, 2025 | 5:06 PM

ప్రతి ఏటా ఇంటర్ పరీక్షలు అనగానే ఎన్నో ప్రశ్నలు.. మరెన్నో సందేహాలు. వాటన్నింటికి చెక్ పెట్టి లక్షల మంది విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటోంది తెలంగాణ ఇంటర్ బోర్డు. పబ్లిక్ పరీక్షలు, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు సమాయత్తం అవుతోంది. పరీక్షల నిర్వహణలో కీలక సంస్కరణలకు ఇంటర్ బోర్డు శ్రీకారం చుట్టింది. ప్రాక్టికల్స్ పరీక్షల్లో అక్రమాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటోంది. హాల్ టికెట్ విడుదలను సైతం ముందుకు జరిపి వారం కాదు నాలుగు వారాల ముందే డౌన్ లోడ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 3 నుంచి ప్రాక్టికల్స్, మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు మొత్తం 9.5 లక్షల మంది హాజరూ కానున్నారు.

క్వశ్చన్ పేపర్ పై డిజిటల్ క్యూఆర్ కోడ్

మార్చి 5 నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షల్లో బోర్డు అధికారులు కీలక మార్పులు చేస్తున్నారు. క్వశ్చన్ పేపర్లలోని ప్రతి పేజీలో క్యూఆర్ కోడ్ తో పాటు సీరియల్ డిజిటల్ నంబర్‌ను ముద్రించాలని నిర్ణయం తీసుకున్నారు. పేపర్ చివర్లలో దీన్ని ప్రింట్ చేయిస్తే.. అక్కడి వరకూ చింపి వాడుకునే చాన్స్ ఉంటుంది. దీంతో ప్రతి పేజీ మధ్యలో వాటిని ప్రింట్ చేయనున్నారు. దీంతో పేపర్ లీకేజీలకు ఆస్కారం ఉండదు. అంతే కాదు క్వశ్చన్ పేపర్లు ముందుగానే బయటకు రావడాన్ని అరికట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు. క్యూఆర్ కోడ్, నంబర్ సాయంతో ఆ ప్రశ్నపత్రం ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. దీంతో పేపర్ బయటకు తీసుకురావాలంటే అందరిలో భయం ఏర్పడుతుంది.

ప్రస్తుతం క్వశ్చన్ పేపర్లను మాములుగానే పేపర్లలో ప్యాక్ చేసి పంపిస్తున్నారు. అయితే, వర్షాలకు అవి తడిచిపోయే అవకాశం ఉంది. ఈసారి తడవకుండా ఉండే కవర్లను వినియోగించాలని భావిస్తున్నారు. కొంతకాలంగా ప్రాక్టికల్స్ నిర్వహణపై అనేక విమర్శలు వస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో ఇష్టానుసారంగా మార్కులు వేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టికల్స్ నిర్వహించే అన్ని కాలేజీల్లోని ల్యాబ్ లలో సీసీ కెమెరాలు పెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు కాలేజీ యాజమాన్యాలకు ఆదేశాలు ఇచ్చారు.