తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త ఫీజులకు సంబంధించిన జీవో రాష్ట్ర సర్కార్ తాజాగా విడుదల చేసింది. తాజా జీవో ప్రకారం బీటెక్ కోర్సుకు ఒక్కోకాలేజీకి ఒక్కో విధంగా మొత్తం 159 కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. ఐతే ఇప్పటికే సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లోనే పెరిగిన మేరకు ఫీజులు చెల్లించాలని జీవోలో పేర్కొంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎంసెట్ ప్రవేశాల కమిటీ వర్గాలు స్పష్టం చేశాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఇప్పటి వరకు సీట్లు పొందిన విద్యార్థులు గతేడాది ఫీజులను ఆన్‌లైన్‌లో చెల్లించిన సంగతి తెలిసిందే. కొన్ని కాలేజీలు మినహా అధిక శాతం కాలేజీల్లో ఫీజులు పెరిగాయి. పెరిగిన మొత్తం రూ.3 వేల నుంచి రూ.52 వేల వరకు ఉంది. అధిక కాలేజీల్లో రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పెరిగింది.
ఇప్పటికే తెలంగాణ ఎంసెట్-2022 రెండో రౌండ్ కౌన్సెలింగ్ కూడా ముగిసింది. దీంతో ఇప్పటి వరకు దాదాపు 64,134 మందికి సీట్లు పొందారు. వీరిలో 50 వేల మంది వరకు ఆయా కాలేజీల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంది. ఈ విద్యార్థులంతా పెరిగిన ఫీజు మొత్తాన్ని సీట్లు పొందిన కాలేజీల్లో నేరుగా చెల్లించాలని కమిటీ వర్గాలు తెలిపాయి. అంటే ఒక విద్యార్థి తనకు సీటు లభించిన కాలేజీ పాత ఫీజు ప్రకారం రూ.లక్ష ఉన్నందున ఆ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో కన్వీనర్‌కు చెల్లించి ఉంటే.. తాజా జీవోతో ఆ కాలేజీ ఫీజు రూ. లక్ష 20 వేలకు పెరిగిందనుకోండి. అదనంగా పెరిగిన రూ.20 వేలను కాలేజీలో చేరిన తర్వాత యాజమన్యానికి చెల్లించవల్సి ఉంటుంది.
ఇక ఎంసెట్ చివరి విడత సీట్ల కేటాయింపు మిగిలి ఉండగా.. ఈ రౌండ్‌లో సీట్లు పొందే విద్యార్ధులకు ఈ విషయాన్ని అలాట్‌మెంట్ లెటర్‌లో పొందుపరుస్తామని అధికారులు తెలిపారు. చివరి విడతలో కూడా పాత రుసుములను కన్వీనరుకు చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా పెరిగిన ఫీజును కాలేజీల్లో చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.