హైదరాబాద్, సెప్టెంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. కళాశాలలకు అనుమతులిచ్చే గడువు సెప్టెంబరు వరకు కావాలని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తుంది. తాజా షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 24వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈఏపీసెట్‌లో ర్యాంకులు పొందిన వారిలో ప్రస్తుతం ఎంపీసీ విద్యార్థులకే ఫార్మసీ కౌన్సెలింగ్ జరిపేందుకు ప్రవేశాల కమిటీ అనుమతి ఇచ్చింది. ఈఏపీసెట్ కన్వీనర్ శ్రీదేవసేన గురువారం (సెప్టెంబర్ 19) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన పూర్తికాగా.. వారంతా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి సెప్టెంబర్ 24, 25 తేదీల్లో అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతానికి బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఒక్క విడత కౌన్సెలింగ్ మాత్రమే జరగనుందని కన్వీనర్ తెలిపారు. కాబట్టి విద్యార్థులు వెబ్ ఆప్షన్లను జాగ్రత్తగా ఇచ్చుకోవాల, మళ్లీ మళ్లీ అవకాశం వస్తుందనే నిర్లక్ష్యం తగదని శ్రీదేవసేన సూచించారు. మొత్తం ఫార్మసీ సీట్లలో సగం ఎంపీసీ విద్యార్థులకు కేటాయించనున్నారు. వారు చేరగా మిగిలిపోయిన సీట్లను బైపీసీ కౌన్సెలింగ్‌లో కలిపి భర్తీ చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్ ట్రైనింగ్ కాలేజీల్లో బీఈడీలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ రెండోదశ (చివరి) కౌన్సెలింగ్ సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు ఎడ్‌సెట్-2024 కన్వీనర్ పి.ఉమామహేశ్వరి షెడ్యూల్‌ను విడుదల చేశారు. గత నెలలో తొలి విడత కౌన్సెలింగ్ పూర్తికాగా.. మిగిలిపోయిన సీట్లకు రెండో విడతలో ప్రవేశాలు కల్పిస్తారు. అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.