హైదరాబాద్, అక్టోబర్ 8: తెలంగాణ ఈఏపీసెట్ బైపీసీ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. బీ ఫార్మసీ, ఫార్మ్ డీ, బయో టెక్నాలజీ, బయో మెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ సైన్సెస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఇంజనీరింగ్ స్ట్రీమ్ కౌన్సెలింగ్ పూర్తికాగా.. అక్టోబర్ 19 నుంచి బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. మొత్తం రెండు దశల్లో కౌన్సెలింగ్ ఉంటుంది. తాజా షెడ్యూల్ ప్రకారం తొలి విడత కౌన్సెలింగ్ కింద అక్టోబర్ 19 నుంచి 22వ తేదీ లోపు ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవల్సి ఉంటుంది.
స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ లోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేస్తారు. అక్టోబర్ 21 నుంచి 25 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవల్సి ఉంటుంది. అక్టోబర్ 28వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆయా కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 28 నుంచి 30వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుని, ట్యూషన్ ఫీజు చెల్లించాలి. ఇక్కడితో తొలి విడత కౌన్సెలింగ్ పూర్తవుతుంది.
తుది విడత కౌన్సెలింగ్.. నవంబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ తేదీ నుంచి ప్రాసెసింగ్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. నవంబర్ 5వ తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. నవంబర్ 5, 6 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. నవంబర్ 9న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు నవంబర్ 9 నుంచి 11వ తేదీలోపు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలాగే ట్యూషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ 11, 12 తేదీల్లో ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. నవంబర్ 12వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవచ్చు.