AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MBBS Seats: ఎంబీబీఎస్‌ స్థానిక కోటాపై తేలని పంచాయితీ.. జూన్‌ 2న సుప్రీంకోర్టులో వాదనలు!

రాష్ట్రంలోని శాశ్వత నివాసితులకు ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో స్థానిక కోటా వర్తింపుపై రగడ ఇంకా కొనసాగుతుంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో 9, 10, 11, 12 తరగతులు చదవలేదనే కారణంతో వారికి వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించడాన్ని నిరాకరించలేమని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని తప్పుబడుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై వాదనలు జూన్ 2కి వాయిదా పడింది..

MBBS Seats: ఎంబీబీఎస్‌ స్థానిక కోటాపై తేలని పంచాయితీ.. జూన్‌ 2న సుప్రీంకోర్టులో వాదనలు!
Domicile Quota In MBBS Seats
Srilakshmi C
|

Updated on: May 21, 2025 | 9:14 AM

Share

హైదరాబాద్‌, మే 21: తెలంగాణ రాష్ట్రంలోని శాశ్వత నివాసితులకు ఎంబీబీఎస్‌ ప్రవేశాల్లో స్థానిక కోటా వర్తింపుపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్‌పై విచారణ జూన్ 2కి వాయిదా పడింది. ఈ మేరకు చీఫ్‌ జస్టీస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం మే 19న ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు వేసవి సెలవుల అనంతరం తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌తో సహా తొమ్మిది పిటిషన్‌లను విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలోని శాశ్వత నివాసితులు బయట నివసిస్తున్నందున, రాష్ట్రంలోని పాఠశాలల్లో 9, 10, 11, 12 తరగతులు చదవలేదనే కారణంతో వారికి వైద్య కళాశాలల్లో ప్రవేశాలు కల్పించడాన్ని నిరాకరించలేమని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీల్‌ను సుప్రీంకోర్టు విచారిస్తోంది. అయితే దీనికి ముందు దేశంలో స్థానికత ఆధారంగా విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు ఉండకూడదని తాన్వీబహెల్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దానికితోడు ఈ కేసులో ఎవరెవరు స్థానికుల కిందికి వస్తారో చెబుతూ నిబంధనలు రూపొందించాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే అప్పటికే రూపొందించిన నిబంధనలను కొట్టేయలేదు. అందువల్ల హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా నష్టపోయిందో అర్థంకావడం లేదని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకర్‌నారాయణన్‌ వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రంలో వరుసగా నాలుగేళ్లు చదివి ఉండాలన్న నిబంధనను ప్రతివాదులు వ్యతిరేకించడం లేదన్నారు. కానీ కొన్నేళ్లు ఇక్కడ చదివి తర్వాత బయటికెళ్లిన వారికి కూడా ఇక్కడ ఎంబీబీఎస్‌ సీట్లు ఇవ్వాలనడం అవకాశవాదం కిందికి వస్తుందని అన్నారు.

అయితే గతేడాది సెప్టెంబరు 20న ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు.. సుప్రీంకోర్టులో ప్రతివాదులుగా చేరిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి ధర్మాసనం అవకాశం కల్పించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొందరు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినా, సుప్రీంకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్లు వేశారని, అవి లిస్ట్‌ కాకపోవడం వల్ల వారికి కౌన్సెలింగ్‌లో పాల్గొనే అవకాశం రాలేదన్నారు. ఆ విద్యార్థులు ఈ ఏడాది నీట్‌ రాసి ప్రస్తుతం సుప్రీంకోర్టును ఆశ్రయించారని పేర్కొన్నారు. తెలంగాణలో పుట్టిపెరిగిన విద్యార్థులు 10వ తరగతి వరకూ అక్కడే చదివినా, ఇంటర్‌ వేరే రాష్ట్రంలో చదివారన్న కారణంతో స్థానిక కోటా వర్తించదని చెబుతున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేరళకు చెందిన వారు 9, 10, 11, 12 తరగతులు తెలంగాణలో చదివితే స్థానిక కోటా కింద ప్రవేశాలు కల్పిస్తున్నారనీ, తెలంగాణలో పుట్టిపెరిగిన వారు కేవలం ఇంటర్‌ బయట చదివారన్న కారణంతో స్థానికులుగా గుర్తించడంలేమని అనడం అన్యాయమన్నారు. నీట్‌ యూజీ 2025 కౌన్సెలింగ్‌ జూన్‌ 14 నుంచి ప్రారంభమవుతుందని, ఆలోపు తీర్పు ఇవ్వాలని పిటీషనర్లు కోరారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు 2024లో సవరించిన తెలంగాణ మెడికల్ అండ్ డెంటల్ కాలేజీల అడ్మిషన్ రూల్స్, 2017లోని రూల్ 3ని ప్రతివాదులు తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్‌కు అర్హులని హైకోర్టు ఇచ్చిన తీర్పు తప్పని రాష్ట్ర ప్రభుత్వం తన అప్పీలులో వాదించింది. తెలంగాణ వైద్య కళాశాలల్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులు అర్హత పరీక్షకు ముందు రాష్ట్రంలో వరుసగా నాలుగు సంవత్సరాలు చదివి ఉండాలని నిబంధన విధించింది. తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యార్థుల ప్రవేశాలను నిర్ణయించడానికి నివాసం, శాశ్వత నివాస హోదా మొదలైన అంశాలను నిర్ణయించే శాసనాధికారం తెలంగాణ రాష్ట్రానికి ఉందనే వాస్తవాన్ని హైకోర్టు విస్మరిస్తుందని అప్పీల్‌లో పేర్కొంది. హైకోర్టు తీర్పు ప్రకారం ప్రవేశానికి కొత్త నియమాలను రూపొందించడానికి చాలా సమయంపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.